రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే..!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అధిష్ఠానం డి.కె.శివకుమార్ నేతృత్వంలో పరిశీలకుల బృందాన్ని హైదరాబాద్ పంపించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం జరిగిపోవాలి. రేవంత్ రెడ్డి ఎంపిక సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో సీనియర్ల రూపంలో అడ్డంకి ఎదురైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడ్డారు. వీరిద్దరితోపాటు మరికొందరు సీనియర్ నేతలు డీకే శివకుమార్ ను విడివిడిగా కలిశారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నామని, పార్టీ విజయానికి కష్టపడ్డామని, తమ అభ్యర్థిత్వాలను కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలించాలని కోరారు. దీంతో పాటు రేవంత్‌రెడ్డితో ఎదురయ్యే సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక.. ముందు నుంచీ ఉన్న సీనియర్ నాయకులు చాలా విషయాల్లో ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. తమను సంప్రదించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు.

భట్టి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో నిలిచారు. వీరితోపాటు డీకేను కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు తమకున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తర్వాత జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. 30 మందికిపైగా ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్ రెడ్డి పేరు చెప్పారు. మిగిలినవారిలో ఎక్కువ మంది ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. భట్టి, ఉత్తమ్ పేర్లను అతికొద్ది మంది మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ దాదాపు 36 గంటల సమయం ఇదే హోటల్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు.












Click it and Unblock the Notifications