హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం, రూ. కోట్లలో విలువ: పలువురి అరెస్ట్, పెద్ద మొత్తంలో గంజాయి
హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు కేసులకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు.

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని నార్త్ జోన్ పరిధిలో దాదాపు 14.2 కిలోల నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ను బేగంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 5.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో దీని విలువ కిలోకి రూ. 40 లక్షలు ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) ఇచ్చిన సమాచారం మేరకు బేగంపేటలోని ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీలో తనిఖీలు చేశామన్నారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఫొటో ఫ్రేమ్స్‌లో డ్రగ్స్ సరఫరా
అనుమానం రాకుండా ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి ప్యాకింగ్ చేసి ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఆర్ఐ నుంచి వచ్చిన సమాచారం మేరకు కొరియర్ చేసేందుకు సింద్ధంగా ఉన్న 22 ఫొటో ఫ్రేమ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొరియర్ చేసేందుకు నకిలీ ఆధార్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు దీంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. తదుపరి దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

డ్రగ్స్ టాబ్లెట్లు.. ముగ్గురికి అరెస్ట్.. తల్లిదండ్రులకు సీపీ విజ్ఞప్తి..
ఇది ఇలావుండగా, మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 110 ఎండీఎంఏ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా మత్తు మాత్రలు విక్రయిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాయి చరణ్, రాచర్ల అంకిత్, అజయ్ సాయిని అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు. పోలీస్ శాఖ తరపున తాను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తల్లిదండ్రులు మీ పిల్లలకు ఖర్చులకు డబ్బు ఇస్తున్నారు. దాన్ని వారు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఎందుకోసం ఖర్చు చేస్తున్నారనే విషయాలను మీరు గమనించాలి. డబ్బున్న వారు, ఎగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, పిల్లలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని సీపీ తెలిపారు.

తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు భారీగా గంజాయి..
హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ కౌకూర్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది రెండు కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ఫరీద్, ఇస్మాయిల్, సచిన్ చవాన్, బస్వరాజును అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. పట్టుబడిన గంజాయి రూ. కోటికిపైగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.40 కోట్లు విలువైన 566 కిలోల పొడి గంజాయిని.. ఏపీ నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా సత్తుపల్లిలో పట్టుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications