హైదరాబాద్లో వ్యాపారవేత్తను చంపి.. ఊటీ కాఫీ ఎస్టేట్లో శవదహనం.. షాకింగ్ క్రైం వెనుక!
క్రైమ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హైదరాబాద్లో ఒక దారుణమైన హత్య జరిగింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేష్ కుమార్ ను హైదరాబాద్ సమీపంలో హత్య చేసి ఊటీలోని ఓ కాఫీ ఎస్టేట్లో మృతదేహాన్ని తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్యలో పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూసాయి.
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
హైదరాబాద్ కు చెందిన రమేష్ కుమార్ అనే వ్యాపారవేత్త భార్య నిహారిక వివాహేతర సంబంధంతో భర్త ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు విచారణలో తేలింది. గత కొంతకాలంగా మృతుడు రమేష్ కుమార్ భార్య నిహారిక, ఆమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ కలిసి పక్కా స్కెచ్ వేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది.

హైదరాబాద్ లో మర్డర్.. కాఫీ ఎస్టేట్ లో శవ దహనం
హైదరాబాద్లో ఉప్పల్ భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసి ఆపై మృతదేహాన్ని మెర్సిడెస్ బెంజ్ కార్ లో హైదరాబాద్ నుంచి ఊటీ తీసుకువెళ్లి ఊటీ దగ్గర ఉన్న కాఫీ ఎస్టేట్లో తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. రమేష్ మృతదేహాన్ని ఊటీ దగ్గర ఉన్న కాఫీ ఎస్టేట్ కు నిహారిక తీసుకువెళ్లినట్టు అక్కడ రాణా అనే మరో వ్యక్తితో కలిసి కాఫీ ఎస్టేట్లో మృతదేహాన్ని తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు.
కాఫీ ఎస్టేట్ లో సగం కాలిన శవం.. కేసులో తేలిందిదే
ఇటీవల వ్యాపారవేత్త రమేష్ కుమార్ సగం కాలిన మృతదేహాన్ని కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్లో పోలీసులు గుర్తించడంతో కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో లభించిన సాంకేతిక ఆధారాలతో కాఫీ ఎస్టేట్లో రమేష్ మృతదేహాన్ని తగలబెట్టిన రాణా అనే నిందితుడిని హర్యానాలోని దాబా వద్ద టీ తాగుతుండగా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆస్తి కోసం భర్తను మట్టుబెట్టిన భార్య
అతనిని తమదైన శైలిలో విచారించగా మృతుని భార్య నిహారిక పేరు బయటకు వచ్చింది. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. 8 కోట్ల రూపాయల ఆస్తికోసం నిహారిక భర్తను హత్య చేయించిన విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇక నిహారికతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డాక్టర్ నిఖిల్ పాత్ర కూడా ఇందులో ఉందని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ వాసులు షాక్
నిహారిక వివాహేతర సంబంధం పెట్టుకున్న నిఖిల్ ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా కాగా మృతుడు రమేష్ కుమార్ హైదరాబాద్ నివాసి, నిహారిక యాదాద్రి జిల్లాకు చెందినవారీగా పోలీసులు గుర్తించారు. మొత్తంగా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆస్తికోసం భర్తను సినీ ఫక్కీలో హతమార్చి ఆపై కాఫీ ఎస్టేట్లో తగలబెట్టిన భార్య ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ వాసులను షాక్ కు గురి చేసింది.












Click it and Unblock the Notifications