Kaushik Reddy Audio Leak : టీఆర్ఎస్ టికెట్ నాకే.. దుమారం రేపుతోన్న కౌశిక్ రెడ్డి ఆడియో లీక్...
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక కాక రేపుతోంది. నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరుపున ఈటల మినహా మిగతా పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆసక్తికర విషయమేంటంటే... గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఊగిసలాటలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ ఏ క్షణమైన గులాబీ గూటికి చేరవచ్చునన్న ప్రచారం ఊపందుకుంది. దానికి బలం చేకూర్చేలా తాజాగా ఓ ఆడియో లీకైంది.

ఆ ఆడియో క్లిప్‌లో సంభాషణ...
తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెబుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని ఆ పార్టీ కార్యకర్త ఒకరితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు లీకైంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఉన్న సంభాషణ ప్రకారం... కౌశిక్ రెడ్డి మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే టీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని విజయేందర్‌తో చెప్పిన కౌశిక్ రెడ్డి... మాదన్నపేట గ్రామ యువతను తనకు అనుకూలంగా పోగు చేయాలని కోరారు. వారి ఖర్చులు ఏమైనా ఉంటే చూసుకోవాలని... నిన్ను నేను చూసుకుంటానని అతనికి హామీ ఇచ్చాడు. గంటన్నరలో లిస్టు పంపించాలని... మండల ప్రెసిడెంట్ బొల్లం రాజిరెడ్డి నీతో టచ్‌లో ఉంటాడని అతనితో చెప్పాడు. నిజానికి ఆ కార్యకర్త ఇటీవలే ఈటల వర్గంలో చేరినట్లు తెలుస్తోంది. తిరిగి వారిని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చి తన మద్దతు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా తాజా ఆడియో కాల్‌తో స్పష్టమవుతోంది.

ఇప్పటికే కోవర్టు అనే ముద్ర..?
కౌశిక్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ కోవర్టు అనే అపవాదును మోస్తున్నారు. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక కౌశిక్ రెడ్డి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓవైపు పార్టీ పెద్దలు ఈటలతో సంప్రదింపులు జరుపుతుండగానే మరోవైపు కౌశిక్ రెడ్డి ఆయనపై భూకబ్జా ఆరోపణలు,విమర్శలు చేశారు. పార్టీ లైన్‌కు కౌశిక్ రెడ్డి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దీంతో కౌశిక్ రెడ్డిని టీఆర్ఎసే ఎగదోస్తోందన్న విమర్శలు వినిపించాయి. దానికి తోడు నెల క్రితం ఓ కార్యక్రమంలో కేటీఆర్‌తో భేటీ అయి కలకలం రేపారు. అయితే అది యాదృచ్చికమని రాజకీయాలతో సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి పార్టీతోనే తన ప్రయాణమన్న సంకేతాలు ఇచ్చారు.

ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా
కాంగ్రెస్ కౌశిక్ రెడ్డికి టికెట్ నిరాకరిస్తున్నదో.. లేక టీఆర్ఎస్ ఆయన్ను ఆకర్షిస్తున్నదో తెలియదు గానీ.. మొత్తానికి కౌశిక్ రెడ్డి రాజకీయం ఊగిసలాటను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన అనుచరులను,మద్దతుదారులను వెంట పెట్టుకుని త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో... 'టీఆర్ఎస్ టికెట్ నాకే' అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లీకవడంతో ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. ఇప్పటికైతే ఈ ఆడియో కాల్ లీక్‌పై కౌశిక్ రెడ్డి నుంచి గానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ ఎటువంటి స్పందన రాలేదు.
Recommended Video

కౌశిక్ టీఆర్ఎస్‌లో చేరితే...
మరోవైపు టీఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో అంత సుముఖంగా లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టవచ్చునన్న ప్రచారం ఉంది. కానీ కౌశిక్ రెడ్డి తాజా ఆడియోను బట్టి టీఆర్ఎస్ అధిష్ఠానం చివరకు ఆయన వైపే మొగ్గిందా అన్న చర్చకు తావిస్తోంది.టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి వచ్చిన హామీ మేరకే కౌశిక్ రెడ్డి ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరితే... అది టీఆర్ఎస్‌కు ప్లస్సా మైనస్సా అన్నది చర్చనీయాంశం. అదే జరిగితే ఈటల గెలుపు నల్లేరు మీద నడకేనని కొందరు అభిప్రాయపడుతుండగా... కౌశిక్ రెడ్డిదే గెలుపుని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications