
ఆ భయంతోనే ఈటల రాజీనామా... ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు : ఎమ్మెల్యే ధర్మారెడ్డి
భూకబ్జాకు సంబంధించిన విచారణలో ఎక్కడ తన బండారం బయటపడుతుందోనన్న భయంతోనే ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. కేవలం తన ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ స్వార్థపరుడని... తన స్వార్థం కోసం నమ్మిన విలువలను పక్కనపెట్టి మరీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారన్నారు.
తాను గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా.. ఎన్నో సంక్షేమ,అభివృద్ది పథకాలు చేపడుతున్న టీఆర్ఎస్ సర్కారుపై ఈటల అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. కమలాపూర్ మండలంలోని నేరెళ్ల, గూడూరు గ్రామాల్లో బుధవారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు.
హుజురాబాద్ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.టీఆర్ఎస్‌ను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతుందన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది.బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వస్తుంది. పోటీనుంచి తప్పుకునే వారు నేరుగా సంతకం పెట్టి నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ప్రధాన అభ్యర్థులగా బరిలో ఉండగా.. 32 మంది స్వతంత్రులు, 7 మంది ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాలెట్‌లో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థులను మాత్రమే పొందుపర్చాల్సి ఉంటుంది. 42 మందిలో సగం మంది విత్‌డ్రా చేసుకున్నా, రెండో బ్యాలెట్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. బ్యాలెట్‌లో అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులు తప్పనిసరి. స్వతంత్ర అభ్యర్థుల పేర్లతో అల్ఫాబెట్ క్రమానుసారం సింబల్స్ కేటాయింపుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Recommended Video
మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయగా... ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.అటు టీఆర్ఎస్,ఇటు బీజేపీ తమదే గెలుపనే ధీమాతో ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతీ ఉపఎన్నికలోనూ గెలుస్తూ వచ్చిన టీఆర్ఎస్ గతేడాది జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో మాత్రం బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.దుబ్బాక ఫలితాన్నే మళ్లీ రిపీట్ చేస్తామని బీజేపీ చెబుతోంది.టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం హుజురాబాద్ తమ కంచుకోట అని... ఈసారి కూడా అది తమ ఖాతాలోనే పడుతుందని చెబుతున్నారు.ఎవరి వాదన ఎలా ఉన్నా... అంతిమంగా ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది నవంబర్ 2న తేలనుంది.