Huzurnagar by election results 2019: ఇది హుజూర్ నగర్ తీర్పు కాదు.. రాష్ట్ర ప్రజల తీర్పు : ఎర్రబెల్లి
హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఇది టీఆర్ఎస్ పార్టీకి హుజూర్నగర్ ఓట్ల తీర్పు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరి తీర్పని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలందరూ సీఎం కేసీఆర్ వెంట ఉన్నారనడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమే ఒక సూచిక అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ చేస్తున్న మంచి పనుల నేపథ్యంలోనే ప్రజలు కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్న ఘటనలు కూడా పెద్దగా చూపించి ప్రతిపక్షాల నాయకులు దుష్ప్రచారం చేశారని, అయినప్పటికీ ప్రజలకు ఏది మంచో ఏది చెడో తెలుసని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సహించరని ఈ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది అన్నారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొందరు కుట్ర చేశారని, ఆ కుట్రలు అన్నింటిని భగ్నం చేస్తూ హుజూర్నగర్ ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కోరిన ప్రతిపక్ష పార్టీలనే ప్రజలు లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు ఎర్రబెల్లి దయాకర్ రావు. మొత్తానికి రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యంతో దూసుకుపోతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి ప్రతిపక్ష పార్టీల నుద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications