గంగమ్మ ఒడికి బడా గణపతి
హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఈ తెల్లవారు జాము నుంచే వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన విశ్వ మహాగణపతి శోభాయాత్ర కొద్దిసేపటి కిందటే ముగిసింది. భారీ క్రేన్ సహాయంతో ఈ 69 అడుగుల మహా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. అంతకుముదు- ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల, లక్షలాదిమంది భక్తజన సందోహం మధ్య మధ్య బడా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగా ఊహించినట్టే మధ్యాహ్నం 1:20 నిమిషాలకు మహాగణపతిని నిమజ్జనం చేశారు.

ఈ ఉదయం మంగళహారతితో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి తరలాడు. అర్ధరాత్రి 12 గంటలకు బడా గణేష్‌కు కలశ పూజ నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం ట్రాలీ పైకి చేర్చారు. 50 టన్నుల బరువు గల అతి భారీ విగ్రహం కావడం వల్ల ప్రత్యేకంగా విజయవాడ నుంచి టస్కర్ ట్రాలీని తెలిప్పించారు. ఈ ట్రాలీ సామర్థ్యం 200 టన్నులు.
ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర రాజ్ దూత్ చౌరస్తా, సెక్రెటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మధ్యాహ్నం 12: 15 నిమిషాలకు ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4కు చేరుకుంది. దాదాపుగా గంట పాటు నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగాయి. టస్కర్ ట్రాలీ మీద ఉన్న విగ్రహాన్ని క్రేన్ పై చేర్చడానికి 40 నిమిషాల సమయం పట్టింది. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ను 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని కళ్లారా వీక్షించడానికి తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న ఏపీ నుంచీ పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయిదు నుంచి ఆరు లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనా. లక్షలాది మందితో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ప్లైఓవర్, సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.












Click it and Unblock the Notifications