చాక్లెట్ల కవర్లలో రూ. 6 కోట్ల విలువైన వజ్రాలు: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కారు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విలువైన వజ్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని డీఆర్ఎస్ అధికారులు సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు.
సదరు వ్యక్తుల ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చాక్లెట్ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన రూ. 6 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 9.33 లక్షల విదేశీ కరెన్సీ, రూ. లక్ష నగదు గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భారీగా గంజాయి పట్టివేత
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ అనే మాట వినిపించకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాల సరఫరాపై డేగ కళ్లతో మాటు వేసి, పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుంటున్నారు.
ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయించేందుకు వచ్చిన నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.13 లక్షల విలువైన 50 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అరకుకు చెందిన జోగి నాయుడు, పంగి కిరోమని, లావణ్యలు తక్కువ ధరకే గంజాయిని కొనుగోలు చేసి.. హైదరాబాద్ నగరంలో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి లోకమాన్య తిలక్ రైల్లో గత కొంతకాలంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications