మత విద్వేశాలు రెచ్చగొట్టేలా..: మెట్రోపొలిస్ హోటల్ యజమాని, మేనేజర్ అరెస్ట్
హైదరాబాద్: మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మెట్రో పొలిస్ హోటల్ యజమాని రషీద్, మనేజర్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మునావర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రషీద్‌ను ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తిత్వ వికాసం పేరుతో యువకులు క్లాసులు నిర్వహించిన మునావర్.. యువకులను రెచ్చగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. మత విద్వేషాలకు వేదికగా నిలుస్తోందంటూ పోలీసులు చేసిన సిఫారసు మేరకు సికింద్రాబాద్‌లోని మెట్రో పొలిస్ హోటల్‌ను ఇప్పటికే రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

ఇక్కడికి వ్యక్తిత్వ వికాస పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ కోసం వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడి ప్రసంగాలతో ప్రేరిపితుడై ఇటీవల కమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా లభ్యమైన ఆధారాల ప్రకారం మెట్రో పొలిస్ హోటల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వేదికగా మారిందని, పోలీసుల అనుమతి లేకుండా నెల రోజులుగా అక్కడ మత విద్వేష ప్రసంగాలు జరిగినట్లు తేలింది.
ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకోవాలని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్.. సికింద్రాబాద్ ఆర్డీవోకు సిఫారసు చేశారు. దీంతో సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, పోలీసు అధికారులతో కలిసి గురువారం హోటల్‌ను సీజ్ చేశారు. గదుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించి, హోటల్‌లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, అమ్మవారి ఆలయంలో ధ్వంసానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో శనివారం ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications