తమ ఓటు తమకు వేసుకోలేకపోయిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు: ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ప్రశాంతంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. తమ ఓటును తమకే వేసుకోలేకపోవడం గమనార్హం. ఎందుకంటే, తమ ఓటు వేరే నియోజకవర్గంలో ఉండటమే ఇందుకు కారణం.
సాధారణంగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తుంటాం. కానీ, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం అలా జరిగే అవకాశం లేకుండా పోయింది. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ ఓటును తమకు వేసుకోలేకపోయారు.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లత తమ సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనికి కారణం మాధవీ లత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలో మహేంద్రహిల్స్‌లో ఉండటమే. దీంతో ఇది మల్కాజిగిరి నియోజకవర్గంలోకి వస్తుంది. ఫలితంగా ఈమె తన ఓటును తనకు వేసుకోలేకపోయారు.
మరోవైపు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన కూడా తన ఓటును తనకు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. చేవెళ్ల ప్రాంతంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎవరూ బరిలో లేరు. దీంతో తన ఓటును వేరొకరికి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక, కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె ఓటు తాండురు అసెంబ్లీ పరిధిలో ఉంది. ఆ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నందున తన ఓటు తాను వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా, ఈ ముగ్గురు నేతలు తమ ఓటును తమకు వేసుకోలేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications