అడ్డా కూలీపై హత్యాచారం-కర్రతో ఆమె జననాంగాల్లో గాయపరిచి-భార్య సహకారంతో దారుణం...
రోడ్డుపై వెళ్లే ఒంటరి మహిళలు,అడ్డా కూలీలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ జంటను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ జంటను అరెస్ట్ చేయగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ జంట గతంలోనూ ఇలాంటి హత్యలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. మహిళల మెడలోని బంగారాన్ని కాజేసేందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది...
బాలానగర్ డీసీజీ పద్మజా రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారం పరిధిలో ఉన్న వైఎస్సార్ కాలనీలో స్వామి,అలియాస్ రవి(30),నర్సమ్మ అనే మహిళతో తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ వికారాబాద్ జిల్లాకు చెందినవారు. గతంలో రవి డ్రైవర్‌గా,అడ్డా కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించేందుకు భార్యతో కలిసి నేరాల బాట పట్టాడు. ఈ నెల 25న మల్లంపేటకు చెందిన ఓ మహిళా అడ్డా కూలీకి పని ఇప్పిస్తామని చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. అగ్గిరాల గుట్ట పైకి తీసుకెళ్లాక స్వామి ఆమెపై అత్యాచారం జరిపాడు. భార్య నర్సమ్మ ఆమె కాళ్లు,చేతులు గట్టిగా పట్టుకోగా... స్వామి అత్యాచారం చేశాడు.

ఇలా వెలుగులోకి...
అత్యాచారం అనంతరం ఓ కర్రతో ఆమె జననాంగాలను గాయపరిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలతో స్వామి,నర్సమ్మ అక్కడినుంచి పరారయ్యారు. చనిపోయిన మహిళా కూలీ ఆచూకీ కోసం ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా స్వామి దంపతులే ఆ మహిళను వెంట తీసుకెళ్లినట్లు గుర్తించారు. గాగిల్లాపూర్ సమీపంలో దుండిగల్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. బంగారం దోచుకునేందుకే ఆమెను హత్య చేసినట్లు చెప్పారు. ఈ హత్య తర్వాత ఇల్లు మారేందుకు ఆ దంపతులు ప్రయత్నించారని... వాళ్ల ప్రవర్తన,తీరు అత్యంత క్రూరంగా ఉందని చెప్పారు.

గతంలోనూ ఇలాంటి నేరాలు..
ఈ కేసు దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. నిజానికి ఈ జంట చాలాకాలంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఒక్క జులై నెలలోనే నలుగురు మహిళల నుంచి బంగారం కాజేశారు. ఇందులో ఒక మహిళను హత్య చేశారు. ఈ జంటపై పోలీసులు కిడ్నాప్,ట్రాప్,రేప్‌లతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఇన్ని నేరాలకు పాల్పడుతూ ఈ జంట పోలీసులకు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఇప్పటివరకూ ఈ జంట ఎన్నినేరాలకు పాల్పడ్డారు... ఎంతమంది మహిళలను హత్య చేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు
.












Click it and Unblock the Notifications