malkajgiri etela rajender ktr Coronavirus covid 19 hyderabad telangana cm kcr ఈటెల రాజేందర్ కేటీఆర్ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ కోవిడ్ 19 తెలంగాణ హైదరాబాద్
ఆమెకు సడెన్ సర్‌ప్రైజ్.. పోలీసులు చేసిన ఈ పనికి ఆశ్చర్యం,ఆనందం..
రూల్స్ బ్రేక్ చేసేవారి తాట తీయడం.. ఆపదలో ఉన్నామంటే పరిగెత్తుకెళ్లడం... లాక్ డౌన్ వేళ పోలీసుల నిబద్దతకు అద్దం పడుతోంది. మాటలతో వినని వారికి లాఠీలతో బుద్ది చెప్పడమే కాదు.. ప్రేమగా అడిగితే ఏ సాయానికైనా వెనుకాడమని నిరూపిస్తున్నారు. లాక్ డౌన్ వేళ ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన హైదరాబాద్ పోలీసులు.. బర్త్ డే విషెస్‌తో ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. ఊహించని ఈ పరిణామానికి ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది.

అసలేం జరిగింది..
మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కె.మూర్తికి ఇటీవల అల్‌ఫ్రెడ్ పాల్ అనే వ్యక్తి నుంచి ఓ విజ్ఞప్తి వచ్చింది. 'నా పేరు అల్‌ఫ్రెడ్ పాల్ తాల్లూరి,మేము అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నాం. మా అమ్మ కుట్టి హదసా పాల్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉంది. ప్రస్తుతం ఇంట్లో మా అమ్మ ఒక్కరే ఉంటున్నారు. ఏప్రిల్ 24న ఆమె పుట్టినరోజు. లాక్ డౌన్ కారణంగా మేము హైదరాబాద్ రాలేకపోయాం. దయచేసి మా తరుపున మీరు వ్యక్తిగతంగా వెళ్లి మా అమ్మకు విషెస్ చెబుతారా. అలా చేస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది. పుట్టినరోజు నాడు మేము ఆమెను సంతోషపెట్టినవాళ్లం అవుతాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాకు ఈ సాయం చేసి పెడితే.. మీకెప్పటికీ రుణపడి ఉంటాం.' అని అందులో పేర్కొన్నారు.

ఆ టాస్క్ వారికి అప్పగించిన డీసీపీ
సాధారణంగా అయితే చాలామంది దీన్ని సిల్లీగా తీసిపడేస్తారు. పోలీసులకు మరే పని లేనట్టు.. ఇలా విషెస్ చెప్పడానికి కూడా మేమే దొరికామా అన్న విసుగురాక మానదు. కానీ డీసీపీ రక్షిత మాత్రం కాస్త పెద్ద మనసు చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ ఇంట్లో ఒంటరిగా ఉన్న 60 ఏళ్ల ఆ తల్లిని సంతోషపెట్టాలనుకున్నారు. మల్కాజ్‌గిరి ఇన్‌స్పెక్టర్,మరో పోలీస్ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు.

సంతోషించిన ఆ మాతృమూర్తి..
ఆ ఇద్దరూ కలిసి శుక్రవారం(ఏప్రిల్ 24) ఉదయాన్నే సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న ఆమె ఇంటి ముందు వాలిపోయారు. ఓ చిన్నపాటి మైక్‌లో ఇన్‌స్పెక్టర్ నర్సింహ 'బార్ బార్ దిన్ యే ఆయే..' అంటూ ఓ పుట్టినరోజు పాట అందుకున్నారు. దీంతో ఇంటి ముందు పాటలు పాడేది ఎవరా అనుకుంటూ ఆమె బయటకు వచ్చారు. పోలీసులను చూసి ఒకింత షాక్ అయ్యారు. కానీ వారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలుసుకుని చాలా సంతోషించారు. ఈసందర్భంగా పోలీసులు ఆమెకు కొన్ని పండ్లను గిఫ్ట్‌గా అందించారు. అటు కుట్టి హదస్సా కుటుంబం కూడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తమ కోరికను మన్నించి తమ తల్లిని సంతోషపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.