Hyderabad rains: నేడు GHMC కార్యాలయం ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపు!!
టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం ముంపుకు గురవుతున్న పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పదివేల రూపాయల సహాయం అందించాలని, వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మునుగుతుంటే సమీక్ష చేసే తీరిక కూడా లేదా అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను టార్గెట్ చేశారు. హైదరాబాద్ నగర రహదారులన్నీ చెరువుల్లా మారాయి అని పేర్కొన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టడంతో పాటు, బాధితులకు 10000 రూపాయలు చొప్పున సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్లతో రేవంత్ రెడ్డి నేడు జిహెచ్ఎంసి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.భారీ వర్షాలకు వరదలకు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ ముంపుకు గురైందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న ప్రజలకు సహాయం అందే వరకు పోరాటం చేస్తామన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారని, యావత్తు ప్రపంచం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని చెప్పుకుంటున్నారన్నారు.
హైదరాబాద్ నగర వాసులు హైదరాబాద్ లో బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ప్రభుత్వ చేతకానితనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications