హైదరాబాద్ లో కుండపోత.. తెలంగాణకు భారీ వర్ష సూచన..
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం జోరుగా వర్షం కురిసింది. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీకాపూల్, సరూర్‌నగర్, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బాగ్ లింగంపల్లి, రామ్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు వర్షంలోనే తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చే నెంబర్ చౌరస్తా, శ్రీ రమణ చౌరస్తా, అలీ కేఫ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అటు ఈదురు గాలుల ధాటికి రామ్ నగర్ వీఎస్టీ రోడ్డు, హైదర్ గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ముషీరాబాద్ తో పాటు నగరంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భాగ్యనగరంలో వరుణుడి బీభత్సం
— oneindiatelugu (@oneindiatelugu) June 9, 2026
గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, చ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో భారీ వర్షం #HyderabadRains #Telanganarains #HyderabadTraffic #WeatherReport #Telangana #OITelugu pic.twitter.com/pqNk8jkSA4
శేరిలింగంపల్లి లోని పలు ప్రాంతాలు, రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం కావడంతో ఆఫీస్ లు, వ్యాపార సంస్థల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు, ప్రజలు వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించింది.

మరోవైపు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇక బుధవారం.. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాలా తదితర జిల్లాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications