అదృష్టం: ఢిల్లీ చేరుకున్న హైదరాబాద్ టెక్కీ నీలిమ
న్యూఢిల్లీ: నేపాల్ భారీ భూకంపం నుంచి బయట పడటం తన అదృష్టమని పర్వతారోహకురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నీలిమ అన్నారు. భూకంప ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన నీలిమ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. భూకంప విధ్వంసం కళ్లారా చూసినప్పటికీ ఎవరెస్ట్ ఎక్కాలని కోరిక ఇంకా ఉందని చెప్పారు.
ఢిల్లీ చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భూకంపం వచ్చిన సమయంలో తాము ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై 4700 అడుగుల ఎత్తులో ఉన్నామని వెల్లడించారు. అయితే భూకంపం వల్ల తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంపు ధ్వంసమైందని తెలిపారు.
తాము ట్రెక్కింగు వెళ్లేప్పుడు ఆహ్లాదంగా ఉన్న పరిసరాలు తిరిగి వస్తుండగా భూకంపం ధాటికి పరిసరాలు, రవాణా వ్యవస్థ, రోడ్లు పూర్తి ధ్వంసమయ్యాయని చెప్పారు. అదృష్టం కొద్ది బేస్ క్యాంపునకు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డామన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ నుంచి కిందికి దిగామని చెప్పారు.

భారీ భూకంపం అనంతరం వచ్చిన ప్రకంపనలతో నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. నేపాల్‌లో ఇండియర్ ఎయిర్‌ఫోర్స్ సేవలు అద్భుతమని కొనియాడారు. మరణం ఎక్కడున్నా వస్తుందని దానికి తానెప్పుడూ భయపడబోనని చెప్పారు.
ఎప్పటికైనా ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమని పర్వతారోహకురాలు నీలిమ స్పష్టం చేశారు. ఏప్రిల్ 18న ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ భూకంపం సంభవించడంతో అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications