ఫలించిన సీఎం రేవంత్ మంత్రాంగం.. హైదరాబాద్‌కు గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్..!!
Google Safety Engineering Centre:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఆగష్టులో అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. నాడు రేవంత్ రెడ్డి బృందం గూగుల్ సంస్థను హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని ఫలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాదులో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (GSEC) ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వంతో ఈమేరకు వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్న తొలి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాదుకు రావడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.
ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో గూగుల్ GSECను తొలిసారిగా హైదరాబాదులో ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టోక్యో తర్వాత ఐదవ తన ఐదవ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు విశ్వనగరం హైదరాబాద్‌ను గూగుల్ సంస్థ ఎంచుకుంది. డుబ్లిన్, మ్యూనిచ్, మలాగాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న GSECలో ఉంటాయని తెలుస్తోంది.

GSEC పాత్ర ఏంటి..?
గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా కీలకపాత్ర పోషిస్తుంది.భారతదేశ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ సేఫ్టీ ప్రాడక్ట్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ కేంద్రంలో అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భద్రతాపరమైన సమస్యలకు పరిష్కారం, సైబర్ సెక్యూరిటీ పై పరిశోధనలు చేసే నిపుణులకు ఇదొక చక్కటి వేదికగా నిలవనుంది. యువతలో నైపుణ్యతను తీర్చిదిద్దడం తద్వారా ఉద్యోగాలు కల్పించడం,భారత్‌లో సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ పనిచేస్తుంది. గూగుల్ సంస్థలో అత్యధిక ఉద్యోగులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కార్యాలయంలో ఉన్నారు. అమెరికాలో ప్రధాన కార్యాలయం తర్వాత ఎక్కువమంది ఉద్యోగస్తులు హైదరాబాద్ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చాణక్యం
గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను దక్కించుకునేందుకు వివిధ పెద్ద రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. 2024 అక్టోబర్ 3వ తేదీన జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించాయి. దీంతో తెలంగాణకు గట్టిపోటీ ఎదురైంది. అయితే ఆగష్టులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమెరికాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి అక్కడి ప్రతినిధులతో భేటీ సందర్భంగా హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎందుకు రావాలో ప్రభుత్వం విధివిధానాలను వివరించడంతో పాటు, టెక్నాలజీ, సృజనాత్మకత, సైబర్ సెక్యూరిటీలకు విశ్వనగరం హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు.

"హైదరాబాదులో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన గూగుల్ సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు. హైదరాబాద్ ఐటీ మరియు ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేందుకు గూగుల్ సంస్థ తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావడమే నిదర్శనం.దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గొప్పతనం ఏంటో తెలిసింది" అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ నగరం పలు బహుళజాతి టాప్ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటాలాంటి సంస్థలున్నాయని సీఎం గుర్తుచేశారు.ఇక ఈ కొత్త భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు హైదరాబాద్ నుంచే పరిష్కార మార్గం కనుగొనేందుకు సాధ్యపడుతుందని అన్నారు.
రేవంత్ రెడ్డి చొరవ భేష్: రాయల్ హాన్సేన్
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించేందుకు చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు సీఐఓ రాయల్ హాన్సేన్.సేఫ్టీ ఇంజినీరింగ్‌లో హైదరాబాద్ నగరం ఒక గ్లోబల్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ విభాగంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఈ కేంద్రం కీలకంగా మారడంతో పాటు హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు మరింతగా పెరుగుతాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ,తమకున్న విజన్‌తో భవిష్యత్తులో మరిన్ని భాగస్వామ్యాలకు మార్గం సుగుమం చేసిందని కొనియాడారు.
మొత్తానికి మరో దిగ్గజ సంస్థ హైదరాబాదులో ఏర్పాటు కానుండటంతో నిరుద్యోగ యువతకు ఇదొక వరంలా మారనుంది. అంతేకాదు ఇప్పటికే విశ్వనగరంగా పిలవబడుతున్న హైదరాబాద్ నగరం పేరు ప్రఖ్యాతలు మరింత పెరగనున్నాయి.












Click it and Unblock the Notifications