ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ నంబర్ 1: సంచలన రిపోర్టు వెల్లడి
తెలంగాణ రాజధాని హైదరాబాద్.. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటిగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో దాదాపు కోటీ 20 లక్షల మంది వరకు జనాభా ఉంది.ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు బిహార్, యూపీ, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. అందుకే హైదరాబాద్ ను మిని ఇండియా అని పిలుస్తుంటారు. అలాగే భారత్ లోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నాలుగోస్థానంలో ఉంది. ఇక నగరంలో ప్రపంచ స్థాయి కంపెనీలు అయిన గూగుల్, ఇన్ ఫోసిస్, విప్రో, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ లు ఉన్నాయి. అలాగే ఫార్మసీ రంగంలోనూ హైదరాబాద్ దేశంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మరో ఘనత సాధించింది.
దేశంలోనే మిడిల్ క్లాస్ కు హైదరాబాద్ నంబర్ 1 గా నిలిచింది. ప్రైస్ అండ్ టాటా సన్స్ నివేదికలో ఈ కీలక వివరాలు వెల్లడయ్యాయి. సగటు కుటుంబ ఆదాయంలో బెంగళూరు, చండీగఢ్, దిల్లీ టాప్ స్థానాల్లో ఉన్నాయి. ఇక ధనవంతుల కేంద్రాలుగా దిల్లీ, ముంబై, పుణె కొనసాగుతున్నాయి. ఈ నివేదికలో మిడిల్ క్లాస్ జనాభా అత్యధికంగా ఉన్న నగరం హైదరాబాద్ అని స్పష్టం అయింది. దేశంలోని టాప్ 100 నగరాలే దేశ ఆదాయం, వినియోగంలో మూడో వంతుకుపైగా వాటా కలిగి ఉన్నాయని ఈ రిపోర్టు వెల్లడించింది.

దిల్లీ ఎన్ సీఆర్ అతిపెద్ద వినియోగ కేంద్రంగా ఉండగా.. టాప్ నగరాల్లో కటిక పేదరికం దాదాపు కనుమరుగవుతోందని నివేదిక స్పష్టం చేసింది. చండీఘడ్, తిరువనంతపురం, వడోదరా నగరాలు కుటుంబ ఖర్చుల్లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఇక దేశంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ గా సూరత్ నగరం నిలిచింది. సూరత్ లో సగటు గృహ వినియోగ ఖర్చు ఏకంగా మెట్రో సిటీలను మించి ఉంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ లో అర్బన్ మిడిల్ క్లాస్ వేగంగా విస్తరిస్తోంది. 2030-31 నాటికి మొత్తం ఆదాయంలో మధ్య తరగతి వాటా గణనీయంగా పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.












Click it and Unblock the Notifications