Hyderabad Air pollution: డేంజర్‌లో హైదరాబాద్..ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!!
Hyderabad Air Quality Index:దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో అల్లాడిపోతోంది. ఇక దీపావళి సందర్భంగా అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాయు కాలుష్యం లేదా గాలిలో నాణ్యత మరింత ప్రమాదకర స్థాయిని తాకింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలను దట్టమైన పొగ కప్పేయడంతో అక్కడి ప్రజలు శ్వాస తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ నగరానికి పాకింది. గత వారం వరకు హైదరాబాదు నగరంలోని గాలి నాణ్యత (Air Quality Index) అంత ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే చాలా ఆందోళనకరంగా కనిపిస్తోంది.
హైదరాబాదు నగరంలో ప్రస్తుతం గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నగరంలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయిని చేరినట్లు తెలుస్తోంది.గత రాత్రి అంటే అక్టోబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాదులో కాలుష్యం స్థాయి ఒక్కసారిగా ఎగబాకింది.దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హైదరాబాదులో గాలిలో నాణ్యత క్షీణించడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. నగరం విపరీతంగా పెరిగిపోతుండటం,పెద్ద సంఖ్యలో వాహనాలు, ఇంకా పెరుగుతున్న వాహనాలు, నగర శివార్లలో పెరుగుతున్న పరిశ్రమల వల్ల కాలుష్యం కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఇక అక్టోబర్ 31వ తేదీ రాత్రి దీపావళి సందర్భంగా పటాసులు కాల్చడం,దాని నుంచి వెలువడిన పొగతో వాతావరణం కలుషితమైంది. దీంతో గాలిలోని నాణ్యత స్థాయి ఒక్కసారిగా పడిపోయింది.
గత నెలలో హైదరాబాదులో గాలి నాణ్యత గణాంకాలు పరిశీలిస్తే స్థిరంగా లేదు. అక్టోబర్ 17వ తేదీన ఏక్యూఐ సూచిక 30గా ఉండగా ఇది మంచి నాణ్యతగా తేల్చడం జరిగింది.అయితే నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం మాత్రం ఇదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171గా నమోదైంది. ఇది తీవ్రస్థాయిని సూచిస్తోంది.నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిలో నాణ్యత తీవ్రస్థాయిని తాకింది. మలక్‌పేట్‌లో AQI 335గా నమోదైంది. మరోవైపు షిర్డీసాయి నగర్ ప్రాంతంలో ఈ సూచిక 101గా ఉంది.ఇది మలక్‌పేట్‌తో పోలిస్తే..కొంతలో కొంత మేలుగానే కనిపిస్తున్నప్పటికీ.. ఇది కూడా ప్రమాదకర స్థాయి కేటగిరీలోనే ఉంది.
గాలిలో నాణ్యత మరింత క్షీణించడం వాతావరణంపై ప్రభావం చూపి అది నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సామాన్యంగా ఒక వ్యక్తి రోజుకు 14000 లీటర్ల గాలిని పీల్చుకుంటారని, అయితే గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నందున అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications