హైదరాబాద్ ప్రజలకు శుభవార్త..!!
హైదరాబాద్ ప్రజలకు హైడ్రా శుభవార్త చెప్పింది. పతంగుల పండగ కోసం చెరువులను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత కూడా పతంగుల పండగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువుల వద్ద పనులను పరిశీలించారు. తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి పలు సూచనలు చేశారు.
చెరువులలోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలు వచ్చేలా ఏర్పాటు వెంటనే చేపట్టాలని సూచించారు. ఎస్టీపీలను ఏర్పాటుచేసిన ప్రాంతంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఇందుకు చెరువు చెంత ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలన్నారు. పార్కుల అభివృద్ధితో పాటు.. గ్రీనరీని పెంచాలని చెప్పారు. ప్రతి చెరువును ఒక పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్లు, చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ చెప్పారు. పతంగుల పండుగ ఆహ్లాదకర వాతావరణంలో జరిగేందుకు జీహెచ్ ఎంసీ, పర్యాటకంతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పని చేయాలని అన్నారు. చెరువుల వద్ద భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే చెరువులను సందర్శించేందుకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడకుండా సులభంగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్న పార్కింగ్ సౌకర్యాన్ని కమిషనర్ పరిశీలించారు.
వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రూపొందుతున్నందున చెరువుల్లో నీటిని నింపేందుకు ఎస్టీపీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీ నది ప్రక్షాళనను ప్రభుత్వం చేపడుతున్న వేళ.. చెరువుల మంచినీరు మూసీలో చేరేలా చూడాలన్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్ల నిర్మాణంతో పాటు.. పరిసర ప్రాంతాల నుంచి వర్షపు నీరు సులభంగా చెరువులోకి చేరేలా ఛానల్స్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
మురుగు నీటితో దుర్గంధబరిత వాతావరణంలో ఆక్రమణలకు గురై చెరువు ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడంతో సంబురాలకు వేదికలౌతున్నాయి. ఇటీవల బతుకమ్మ ఉత్సవాలకు అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వేదికైతే.. నేడు సంక్రాంతి సంబరాలకు బతుకమ్మకుంటతో పాటు.. మాధాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా వేదికలౌతున్నాయి.












Click it and Unblock the Notifications