నేను మారాను, మీరూ మారండి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సంబంధాలను మెరుగుపర్చుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, పార్టీ నాయకులు సీఎంను కలిశారు.
తాజా రాజకీయ పరిణామాలతో ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరు, ప్రొగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయన్నారు. తన ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించానని.. అందరికీ ప్రొగ్రెస్ రిపోర్టు ఇస్తానని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళదామన్నారు.

ఏడాది పాలనలో మనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని.. తెలియకుండా జరిగిన తప్పులపై చరయలు తీసుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఏడాది పాలన అనుభవాలు.. వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయన్నారు. అంగన్‌వాడీ డీలర్ల నియామకంలో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలని సీఎంను ఓ మంత్రి కోరగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని.. పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం రేవంత్ చెప్పారు.
ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని సీఎం రేవంత్ తెలిపారు. మీరు నన్ను ఏ విధంగా అనుకుంటారో.. మిమ్మల్ని మీ కింది నాయకులు అలాగే అనుకుంటారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలని, అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల నియామకం, ప్రమోషన్లు గత ప్రభుత్వం ఎందుకు వచ్చిన లొల్లి అని చేయలేదని.. కానీ, మనం ఎవరికీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications