ఏపీలో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రా తెలంగాణా కలిసిపోతాయేమో.. భయమేస్తుందంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ముందే రచ్చ!!
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జూన్ నెలలో రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు నుంచి నిరసన గళం వినిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి హైదరాబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణా ద్రోహులు
తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందరిని రేవంత్ రెడ్డి తన పక్కన పెట్టుకున్నారని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలో తాము ముందు వరుసలో ఉంటే, ఎన్నో త్యాగాలను చేస్తే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాడు తెలంగాణను వ్యతిరేకించిన వారిని పక్కనే పెట్టుకున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలను ఒప్పుకోం.. చంద్రబాబును ఒప్పుకోం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఒప్పుకునేది లేదని, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు గెలిస్తే, తెలంగాణ, ఆంధ్ర కలిసిపోతాయేమో అని అంటూ, తమకు భయంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ కలుపుతారు ఏమోనని, అలాంటి సూచనలు కనిపిస్తున్నాయ్ అంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీనేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముందే పాశం యాదగిరి వ్యాఖ్యలు చేశారు.
పాశం యాదగిరి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడిన కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాశం యాదగిరి వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి ఉద్యమకారులను ఆదరించి సన్మానిస్తామని చెబితే రామని చెప్పడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం పలువురిని పార్టీలో జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందని, దానికి తెలంగాణ రాష్ట్రానికి ముడి పెట్టడం సరికాదన్నారు.
స్టేజి పై రచ్చ రచ్చ
ఇక మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుండగానే పాశం యాదగిరి ఆయనతో గొడవకు దిగారు. ఆయన చేతిలోని మైక్ లాగేసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. ఆపై అక్కడ ఉన్నవారు కలుగ చేసుకోవడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. ఏది ఏమైనా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారని తెలంగాణ ఉద్యమకారుడు వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఈ ఘటనతో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications