మళ్లీ భారీ వర్షాలు, మరో మూడు రోజులు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల పై అలర్ట్ జారీ అయింది. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరుసగా కురిసిన వర్షాలతో నదులు పొంగి ప్రవహించాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈ రోజు భారీ వర్షం కురిసింది. రానున్న మూడు రోజుల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల పైన వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అరేబియా సముద్రంలో శక్తి తుఫాను పై పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
వాతావరణ శాఖ మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు మరోసారి వాన గండం పొంచి ఉంది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశాలున్నాయని వివరించింది. ఇటీవల దంచికొట్టిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రోడ్లు చెరువులను తలపించాయి. తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

కాగా, ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ నగరం సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు వర్షాలకు రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications