తెలంగాణకు ఎల్లో అలర్ట్: ఈ జిల్లాల్లో వడగాలులు, ఆ సమయంలో బయటికి రావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటోంది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకు అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం(IMD) వెల్లడించింది.
బుధ, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ వడగాలులు వీచనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండేందుకు పళ్లరసాలు, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు, ద్రోణి ఒకటి దక్షిణ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని స్పష్టం చేసింది. నేటి నుంచి మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications