వదలని వరుణుడు, మళ్లీ భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో చోటు చేసుకుంటున్న మార్పుల కు అనుగుణంగా వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయం లో మరోసారి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు తాజా అలర్ట్ జారీ చేసింది. నైరుతి విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మరాత్వాడ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 5.8 కి మీ ఎత్తువరకు ఉంది.

అలాగే.. ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్ - మధ్య ప్రాంతం నుండి తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. ఆగ్నేయ బంగాళా ఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. వీటి ప్రభావంతో రాగల 3 రోజుల్లో వర్షాల పైన అప్రమత్తం చేసింది.
ఈ రోజు (బుధవారం) తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఈ రోజు హైదరాబాద్ నగరం తో పాటుగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసారు.
బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఎల్లో అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లోనూ చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications