రేవంత్ కు సీనియర్ల చెక్, హైకమాండ్ కు అల్టిమేటం - కొత్త సమీక"రణం"..!!
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. సీఎం పదవి ఖరారు విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైందనే వార్తలనే వినిటానికి సీనియర్లు అంగీకరించటం లేదు. నిర్ణయమే జరగలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ మినహా ఎవరికైనా ఓకే అంటున్నారు. రేవంత్ కే ఇవ్వాలనుకుంటే తమ పదవులపైన కండీషన్లు పెడుతున్నారు. సామాజిక సమీకరణం తెర మీదకు తెస్తున్నారు. పరోక్షంగా ఢిల్లీకి అల్టిమేటం ఇస్తున్నారు.
కాంగ్రెస్ మార్క్ రాజకీయం:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండో రోజే కాంగ్రెస్ రాజకీయం బయటకు వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ విమర్శించినట్లుగానే సీఎం రేసులో కీచులాటలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే రేవంత్ సీఎం అంటూ లీకులు బయటకు రావటం పై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. తమ అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్ పేరు ఎలా ఖరారు చేస్తారని నేరుగా డీకేను ప్రశ్నించారు. దీంతో, సీనియర్లు ఉత్తమ్, దామోదర్ రాజనర్సింహ, భట్టి, కోమటిరెడ్డితో డీకే మంతనాలు జరిపారు. అందరి అభిప్రాయాలను హైకమాండ్ కు నివేదిస్తామని స్పష్టం చేసారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ సామాజిక సమతుల్యత పాటించాలని..దళిత వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుంటే నష్టోతామని వివరించినట్లు తెలుస్తోంది. రేవంత్ సీఎం అయితే తమకు ఇచ్చే ప్రాధాన్యత పైన స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో, డీకే మొత్తం వ్యవహారం ఢిల్లీకి నివేదించారు.

తెర పైకి సామాజిక సమీకరణం:బీజేపీ తెలంగాణలో సామాజిక సమీకరణాలను ఎన్నికల అస్త్రాలుగా మలచుకుందని పార్టీ నేతలు గుర్తు చేసారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ది జరగాలంటే సీఎం తో సహా కేటినెట్ కూర్పులోనూ సామాజిక సమతుల్యత అవసరమని వాదించినట్లు తెలుస్తోంది. ఈ దశలో దళిత సీఎం తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, మెజార్టీ కంటే కేవలం నాలుగు సీట్లే ఎక్కువగా ఉండటం..ఇచ్చిన హామీల అమలు..త్వరలో లోక్ సభ ఎన్నికలు వంటి కీలక టాస్క్ లు ఉండటంతో ఎవరు సమర్ధులనే ఆలోచన సోమవారం రాత్రి సోనియా వద్ద ఖర్గే, వేణు గోపాల్ వద్ద చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, రేవంత్ కు సీఎం పదవి ఇస్తే..భట్టికి డిప్యూటీ ఇవ్వాలని తొలుత ప్రతిపాదించారు. కానీ, భట్టి తనకు పీసీసీ చీఫ్ తో పాటుగా తానొక్కడే డిప్యూటీగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక, రేవంత్ టీంకే కేబినెట్ లో ప్రాధాన్యత ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం.
హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ:దీంతో..ఢిల్లీలో సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక తరహా ఫార్ములానే తెలంగాణలో అమలు చేస్తే ఎలా ఉంటుందనే చర్చ తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో దళిత సీఎంకు అవకాశం ఇస్తే త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో సానుకూలంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీలో ఎదురయ్యే పరిణామాల పైన చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ను సీఎం చేస్తే ఏ సామాజిక వర్గానికి ఏ పదవి ఇవ్వాలనే కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. సీనియర్లకు సముచిత ప్రాధాన్యత ఇస్తూనే..వారికి రొటోషన్ పద్దతిలో పదవులు దక్కేలా హామీ ఇచ్చేందుకు కొత్త ఫార్ములా సిద్దం చేస్టున్నట్లు తాజా సమాచారం. దీంతో..ఇప్పుడు సీఎం ఎంపిక విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం ఏంటి..సీనియర్ల స్పందన ఎలా ఉంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications