• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే: వేరే పేరుపై రిజిస్ట్రేషన్, అదే ముత్తిరెడ్డి ధైర్యం

By Swetha Basvababu
|

హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకమ్మ కుంట శిఖం భూముల కబ్జా వ్యవహారం రోజురోజుకో మలుపులు తిరుగుతున్నది. దీని విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, జిల్లా కలెక్టర్‌ శ్రీ దేవసేన మధ్య నెలకొన్న వివాదంలో తొలిదశలో ఉన్నతాధికారుల నుంచి ఆమెకు గట్టి మద్దతు లభించింది.

కానీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంతో వారంతా ప్రభుత్వ ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తున్నది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలికి అక్కడి స్థానిక ఎమ్మెల్యేతోనూ ఇదే గొడవ ఉంది. నెలక్రితమే వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలిని జనగామకు, శ్రీ దేవసేనను వరంగల్‌కు బదిలీ చేయాలని కడియం శ్రీహరి సూచనప్రాయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తున్నది. ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో తలెత్తిన వివాదం కారణంగా కలెక్టర్‌ శ్రీ దేవసేనపై ప్రభుత్వం వేటు వేస్తే జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

అతి తక్కువ కాలంలో ప్రజలకు చేరువ కావడంతో పాటు ప్రతి విషయంలోనూ కలెక్టర్ దేవసేన స్పందిస్తున్నారన్న పేరుంది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాను బయటపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అన్ని రాజకీయ పార్టీలు కలెక్టర్‌కు బాసటగా ఉంటామని ప్రకటించాయి. కలెక్టర్‌ను బదిలీ చేసే అవకాశం ఉంటుందని ముందే భావించిన పార్టీలు వేటువేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాయి. బతుకమ్మకుంట ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది వాస్తవమే కాగా మత్తడి ప్రాంతం కబ్జాకు గురైందని అన్ని రాజకీయ పార్టీలతో పాటు కలెక్టర్‌ కూడా తేల్చారు.

అధికారులిచ్చే నివేదికను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకుంటారా?

అధికారులిచ్చే నివేదికను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకుంటారా?

అయితే అది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర రిజిస్ట్రేషన్‌ కాలేదు. కబ్జాకు గురైన భూమి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు మీద కాకుండా వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. అది వేరే సర్వే నంబర్‌లో ఉండటంతో లాజికల్‌గా ముత్తిరెడ్డి చట్ట ప్రకారం చిక్కుతాడా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన విషయాన్ని చట్ట ప్రకారం చూపడానికి రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అధికారులు అందజేసే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాల రీత్యా ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటారన్న సంగతి మున్ముందు తేలనున్నది. ఇక స్థానిక ఎమ్మెల్యేలతో కలుపుకుపోని కలెక్టర్లను బదిలీ చేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. గతంలో పెద్దపల్లి కలెక్టర్‌ను బదిలీ చేయగా, కరీంనగర్‌ కలెక్టర్‌ విషయంలోనూ స్వయంగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం కలెక్టర్‌పై బదిలీ వేటువేస్తే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో పాటు ఐఏఎస్‌లు ఒక్కటయ్యే అవకాశం ఉంది.

ఇలా బతుకమ్మ కుంటగా రూపాంతరం

ఇలా బతుకమ్మ కుంటగా రూపాంతరం

కలెక్టర్‌ దేవసేన చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్‌కు వివరణ ఇవ్వడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విశ్వప్రయత్నాలు చేసినా, ఫలించకపోవడంతో చివరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలిశారు. పూర్తి వివరాల వెల్లడితోపాటు సీఎం పీఆర్వో ద్వారా సీఎం కేసీఆర్‌కు పూర్తిస్థాయి సమాచారం పంపారు. కలెక్టర్‌ తనపై అసత్య ఆరోపణలు చేసిందని చెప్పడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలను కలుపుకుపోవడం లేదన్న విషయాన్ని సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేరవేసినట్టు తెలుస్తున్నది. బతుకమ్మకుంట పూర్తి వివరాల్ని అందజేయడంతోపాటు దుర్గమ్మగుడి నిర్మాణంలో ట్రస్ట్‌ ఏర్పాటు చేయడానికి కారణాలు అఖిలపక్ష పార్టీల ఏకాభిప్రాయం మేరకు జరిగిన రిజిస్ట్రేషన్‌ తీర్మానాలను చూపినట్టు సమాచారం.

సీఎస్ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక

సీఎస్ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక

వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు అందజేసిన తరువాత సీఎం సలహా మేరకే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధుల్ని కలుపుకుపోనందున ఆమెను బదిలీ చేయాలని కూడా కోరినట్టు సమాచారం. తాను ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని తెలిపారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వివరించినట్టు ముత్తిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక్క గుంట భూమి తన పేర ఉన్నా రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కలెక్టర్‌ తాను చేసిన ఆరోపణలకు సాక్షాలను ప్రభుత్వానికి అందజేయాలని చీఫ్‌ సెక్రటరీ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా మహా బతుకమ్మ ఉత్సవాల్లో ఉన్నందున ఆమె అందుబాటులోకి రాలేదు.

మినీ ట్యాంక్‌బండ్‌గా మారిందిలా..

మినీ ట్యాంక్‌బండ్‌గా మారిందిలా..

వివాదానికి కేంద్ర బిందువైన బతుకమ్మ కుంటపైకి అందరి దృష్టి మళ్లింది. అసలు ఆ చెరువును ఎలా పూడ్చేశారు? అక్కడ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది? నీటి వనరులు ఎందుకు మూసుకుపోయాయి? చెరువు కాస్త ఈత కొలనుగా ఎలా మారింది? నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? తదితర ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జనగామ నుంచి సూర్యాపేట రోడ్డు వైపు వెళ్లే దారిలో బతుకమ్మ కుంట ఉంది. మొదట దీన్ని ధర్మోనికుంట అని పిలిచేవారు. ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంట పేరును బతుకమ్మ కుంటగా మార్చారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు ఇక్కడో మినీ ట్యాంకు బండ్‌ నిర్మాణం చేపడుతున్నారు. మొదట్లో పట్టణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, ఇతర వర్గాల ప్రజల సహకారంతో రూ. 30 లక్షల విరాళాలను సేకరించి ఈ కుంట ప్రాంతంలో ఉన్న చెట్లను, కట్ట మరమ్మతుపనులు ప్రారంభించారు. అయితే విరాళాల సేకరణలోనూ అవకతవకలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. ఇదే బతుకమ్మ కుంట విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌తోనూ 2014లో వాగ్వాదానికి దిగారు.

ఇలా మినీ ట్యాంక్ బండ్‌గా సుందరీకరణ

ఇలా మినీ ట్యాంక్ బండ్‌గా సుందరీకరణ

కుంట నీటిపారుదల శాఖ అధీనంలో ఉండగా, దాన్ని సుందరీకరణ చేయాలంటే నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలి. అధికారులు నిబంధనలు పరిశీలించాక అనుమతి ఇస్తామని చెప్పినా, వెంటనే ఎందుకు ఇవ్వరని ముత్తిరెడ్డి అధికారులతో గొడవకు దిగారు. అనంతరం ప్రభుత్వం నుంచి బతుకమ్మ కుంట అభివృద్ధి, మినీట్యాంకుబండ్‌గా మార్చడం కోసం రూ. 1.05 కోట్లు మంజూరయ్యాయి. విరాళాలు, ప్రభుత్వ నిధులతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం 2015లోనే పూర్తయింది. మినీ ట్యాంక్ బండ్ ఆవరణలోనే 2000 గజాల్లో దుర్గమ్మ దేవాలయం నిర్మించారు. ఇందుకోసం ప్రయివేటు వ్యక్తుల నుంచి 1.5 ఎకరాల భూమి సేకరించారు. తొలుత ప్రతిపాదించిన దాని ప్రకారం మినీట్యాంకు బండ్ మరికొన్ని పనులు పూర్తి కాలేదు.

కుంట పూడ్చివేతపై చర్చలోకి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

కుంట పూడ్చివేతపై చర్చలోకి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

బోటింగ్‌, విద్యుత్ దీపాల ఏర్పాటు, గార్డెనింగ్‌ నిర్వహణ, గేట్ల ఏర్పాటు, సందర్శకులు కూర్చోవడానికి బల్లలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు అవసరం అవుతాయని ముత్తిరెడ్డి రెండో దశ నిధుల కోసం రూ.1.40 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎమ్మెల్యే గుడిపేరుతో చెరువు శిఖాన్ని ఆక్రమించారని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం నిధులను మంజూరు చేయలేదు. తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక నిధులను విడుదల గురించి కలెక్టర్‌ దేవసేన అడిగారు. ప్రభుత్వం నిధులు ఆపేస్తే తాను ఎలా విడుదల చేయగలనని, మినీట్యాంక్‌బండ్ నిర్మాణం పనుల్లో అవకతవకలు జరిగాయని, శిఖం భూమిలో గుడిని నిర్మించడమే కాక కుంటను పూడ్చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని కలెక్టర్‌ శ్రీదేవసేన తేల్చిచెప్పారు. అంతే కాకుండా మినీ ట్యాంకు బండు వద్ద ఈసారి బతుకమ్మ వేడుకలు జరపబోమని, మరో ప్రాంతంలో సంబరాలు చేస్తామని కలెక్టర్‌ తేల్చిచెప్పడంతో ఈ వివాదం వేడెక్కింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janagaon Bathukamma Kunta dispute hot topic in district and state level. There are allegations that MLA Muthireddy encroachment of this lake. Collector Devasena proved that land illigally occupied by MLA MuthiReddy and she has organised Maha Bathukamma another venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more