రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు..!!? బీజేపీ నుంచి కోమటిరెడ్డి - టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్..!!
తెలంగాణలో నాడు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు బీజేపీ అమలు చేసేందుకు సిద్దం అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలు పలు మార్లు రాజీనామాలు చేసారు. అనేక సార్లు ఉప ఎన్నికల్లో గెలిచారు. ప్రజల్లో ఉన్న తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటారు. ఇదే తరహాలో ఇప్పుడు బీజేపీ సైతం ముందుకు కదులుతోంది. దుబ్బాక..గ్రేటర్ హైదరాబాద్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ..ఇప్పుడు మరిన్ని ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. దీని ద్వారా టీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెడుతూ... వాటిల్లోనూ గెలవగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలం సాధించవచ్చనే అభిప్రాయంతో ఉంది. అందులో భాగంగా ముందుగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పైన బీజేపీ ఫోకస్ చేస్తోంది.

మునుగోడు బై పోల్ కోసం బీజేపీ
అందులో భాగంగా.. తొలుత నల్గొండ జిల్లా మునుగోడు పైన దృష్టి పెడుతోంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొద్ది నెలలుగా ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో బీజేపీకే ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేర్చుకొనేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదు. పైగా, తాను భవిష్యత్తులో బీజేపీలో చేరుతానని కూడా ఆయన ప్రకటించడాన్ని కమలనాథులు గుర్తు చేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతోందా
రాజగోపాల్‌రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, తమ పార్టీ తరఫున పోటీ చేస్తే మళ్లీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ వెంటనే బీజేపీలో చేరే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఒకవేళ కోర్టు తీర్పు రమేశ్‌కు వ్యతిరేకంగా వస్తే.. ఆయన శాసనసభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అక్కడ కూడా ఉప ఎన్నిక ఖాయమవుతుంది.

వేములావాడ పైన ఆశలు
అప్పుడు అక్కడ ఎవరిని నిలబెట్టాలన్నది ఉప ఎన్నిక ఖాయమయ్యాక నిర్ణయిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ మ పార్టీ టిక్కెట్ రేసులో అభ్యర్ధులు ఉన్నారంటూ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 105 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినా.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను అనూహ్యంగా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయాలతో రాష్ట్ర బీజేపీలో కొత్త ఆశలు చిగురించాయి.

టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ రెడీ
అనంతర పరిణామాల్లో రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరగగా.. తొలుత హుజూర్‌నగర్‌లో డాక్టర్ కోట రామారావును నిలబెట్టిన బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేసినా.. ఆయన తిరస్కరించారు. ఆయన వచ్చి ఉంటే ఆ స్థానం కూడా తమ ఖాతాలో చేరేదని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక, బీజేపీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ఉప ఎన్నికల ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. దీనికి టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ అమలు చేస్తోంది. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ ప్రచారం చేయటంతో పాటుగా .. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టింది.
Recommended Video

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారుతున్న రాజకీయం
అదే సమయంలో ఉప ఎన్నికలు కోరుకుంటూ..ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా వెంటనే ఆమోదించటం అనేది స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. ఉప ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను దృష్టి లో ఉంచుకోని బీజేపీ వ్యూహాలను అంచనా వేస్తోంది. 2023 లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో... ఇక, 2022 లో ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యేగా కొనసాగేది ఏడాది కంటే ఎక్కువ సమయం ఉండదనేది గుర్తు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు బైపోల్స్ కోసం రిస్కు తీసుకోవటానికి నేతలు ముందుకు వస్తారా అనేది మరో చర్చ. దీంతో..రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications