సీఎం గారూ సూటిగా చెప్పండి.!దళిత బంధు ఉందా.?అటకెక్కిందా.?కేసీఆర్ ను నిలదీసిన బీజేపి నేతలు.!
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపి సీనియర్ నేతలు ఖండించారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు ఏమేరకు మారాయో గులాబీ నేతలు జవాబు చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ నిలదీసారు.

బీజేపిని చూసి టీఆర్ఎస్ భయపడుతోంది.. అందుకే బండి సంజయ్ మీద ఆరోపణలన్న బీజేపి నాయకులు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే భరించలేక బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని గులాబీ నేతలపై కమలం నేతలు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ పదవుల కోసం... సీఎం మెప్పు పొందేందుకు బానిసలుగా బతుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. దళిత బంధు సంగతి ఏమైందని, ఈ పథకం కోసం డిపాజిట్ చేసిన 1600 కోట్ల రూపాయలు 4 నెలలైనా ఎందుకు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ కాలేదో స్పష్టం చేయాలని నిలదీసారు.

దళిత నియోజక వర్గాల్లో ప్రభావం చూపిస్తాం.. గులాబీ పార్టీ డిపాసిట్ కూడా దక్కనివ్వమన్న బీజేపీ
రాబోయే ఎన్నికల్లో దళిత నియోజకవర్గాల్లో గెలిచిన 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని బీజేపి స్పష్టం చేస్తోంది. సీఎం నిర్వహించిన సర్వేల్లోనూ ఈ విషయం తేలిపోయిందని, అంబేద్కర్ జయంతి, వర్దంతి సహా ఏ ఒక్క కార్యక్రమానికి హాజరుకాని సీఎంను ఏనాడైనా దళిత టీఆర్ఎస్ నేతలు నిలదీశారా? దేశంలో 40 వేల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే అందులో ఒక్క తెలంగాణలో మాత్రమే 10 వేల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సంగతిని మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్మరించారా? వీటిలో ఎంతమందికి శిక్ష పడిందో మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. టీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదన్న బీజేపి
బీజేపీ ఎక్కడుందని అడుగుతున్న టీఆర్ఎస్ నేతలు, కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వేలు చెబుతున్న సంగతిని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోనూ ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని, టీఆర్ఎస్ అక్రమాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న బండి సంజయ్ పై ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ఏడేళ్లలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని, 13 వేల బ్యాక్ లాగ్ పోస్టులను జీరో చేసి దళితుల నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా అని బీజేపి నేతలు ప్రశ్నించారు.

దళితబంధు పై హరీష్ రావు, మోత్కుపల్లి పెదవి విప్పాలి.. డిమండ్ చేసిన బీజేపి నేతలు
టీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, బీజేపీ మాత్రమే దళిత, గిరిజన పక్షపాతి అని అన్నారు. నవంబర్ 4 నుండి దళిత బంధు అమలు కాకపోతే తన పేరు మార్చుకుంటానన్న హరీష్ రావు... ఉరేసుకుంటానన్న మోత్కుపల్ల నర్సింహులు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీసారు. ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో దళిత, గిరిజన విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకపోతే ఆయా శాఖల మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారని, దళిత, గిరిజన సమస్యలపై బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ పోరాడుతూనే ఉంటుందని ఎస్ కుమార్, ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేసారు.