Malkajigiri: మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి.. నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నాయి. బీఆర్ఎస్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి స్థానాలను పెండింగ్ లో పెట్టారు. తాజాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మల్కాగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపిక చేసే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనకు సీటు ఇస్తే సానుభూతి పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజశేఖర్ రెడ్డినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. రాజశేఖరెడ్డి కూడా ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు.

ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అటు జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగానే తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఏదైనా కార్పొరేషన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు నర్సాపూర్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు, సునీతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ అధిష్ఠానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక గోషామహల్ స్థానానికి నందకిశోర్, ఆశీష్‌కుమార్ యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాంపల్లి అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలిసింది. కేసీఆర్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకొగానే మిగిలిన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications