మోడీ కోరుకున్నవారే యుద్ధానికి సిద్ధం: రంగంలోకి పవన్ కళ్యాణ్, జేపీతో భేటీ
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడే రంగంలోకి దిగారు. ఆయన గురువారం లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను కలిశారు.
Recommended Video

బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో ఆ పార్టీ అధినేతతో జనసేనాని భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉండవల్లి అరుణ్ కుమార్, జేపీలతో కలిసి జేఏఏసీని ఏర్పాటు చేస్తామని, ఉమ్మడిగా పోరు చేస్తామని బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

పలు అంశాలపై చర్చించిన పవన్, జేపీ
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. జేపీని కలుసుకున్నారు. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, నాడు కేంద్రం విభజన చట్టంలో పెట్టిన అంశాలు, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలపై సంక్షిప్తంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే కలిసి ముందుకు వెళ్లే అంశంపై వారి మధ్య చర్చ జరిగింది. ఉండవల్లితోను పవన్ భేటీ అయ్యే అవకాశముంది.

పవన్ అభిప్రాయం
జేపీ, ఉండవల్లి వంటి వారి మద్దతుతో పవన్ కళ్యాణ్ ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై పోరాడనున్నారు. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటయింది. ఇప్పుడు పవన్ కూడా ఆ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. పార్టీలకు అతీతంగా పోరాడితేనే ముందుకు సాగుతేనే హోదా లేదంటే దానికి సమానమైన ప్యాకేజీ సాధించగలమని పవన్ భావిస్తున్నారు.

కోరుకున్న వారే మోడీకి ఝలక్
ప్రధాని నరేంద్ర మోడీ నాడు (2014)లో కోరుకున్న వారే ఇప్పుడు ఏకమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. కాంగ్రెస్ శాస్త్రీయత లేని విభజనతో అన్యాయం చేసిందని, కాబట్టి మోడీ న్యాయం చేస్తారని పవన్ బీజేపీకి మద్దతిచ్చారు. మరోవైపు జేపీ వంటి వారు పార్లమెంటులో ఉండాలని మోడీ కోరుకున్నారు. మోడీ కోరుకున్న వారే ఇప్పుడు ఏకమవుతున్నారు.

ముగ్గురు కలిసి
విభజన చట్టంలోని హామీలతో పాటు స్వయంగా మోడీ కూడా ప్రత్యేక హోదా వంటి హామీలు ఇచ్చారు. కానీ హోదా లేదా దానికి బదులు ప్యాకేజీ, రైల్వే జోన్ ఏవీ నెరవేరలేదు. దీంతో ఇన్నాళ్లు ఓపిక పట్టిన పవన్ ఇప్పుడు కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. హామీలు సాధించే దిశలో ఉద్యమానికి పవన్, జేపీ, ఉండవల్లి ముగ్గురు పావులు కదపనున్నారు.












Click it and Unblock the Notifications