నాటుకోడి కూర తెచ్చిన తంటా.. కొడుకు చేతిలో తండ్రి హతం!
మనుషులు క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, నియంత్రించుకోలేని కోపం ఒక్కోసారి ఊహించని ఘోరాలకు దారితీస్తాయి. తాజాగా జనగామ జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటనే ఇందుకు నిదర్శనం. కేవలం నాటుకోడి కూర వండాలనే చిన్న పట్టింపు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకువడమే కాకుండా ఓ పచ్చని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. నాటుకోడి కూర కోసం మొదలైన భార్యాభర్తల వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. చివరకి కన్నతండ్రిని కొడుకే అంతమొందించేలా చేసింది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జంగిలి రమేశ్(42), అనూష దంపతులు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రమేశ్ ఓ నాటుకోడిని ఇంటికి తీసుకువచ్చాడు. దానిని వెంటనే కోసి, కూర వండాలని భార్య అనూషను కోరాడు. అయితే అప్పటికే రాత్రి సమయం మించిపోవడం, ఇంట్లో అప్పటికే అంగడి నుంచి తెచ్చిన చేపల కూర వండి సిద్ధంగా ఉంచడంతో అనూష భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. "ఇవాళ ఇప్పటికే చేపల కూర వండాను కదా.. రాత్రి పది దాటింది, ఇప్పుడు వద్దు.. కోడిని రేపు ఉదయం కోసుకుని వండుకుందాం" అని ఆమె సర్ది చెప్పబోయింది.

కానీ మద్యం మత్తులో ఉన్న రమేశ్ భార్య మాటలను అస్సలు ఖాతరు చేయలేదు. ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన రమేశ్ అనూషను ఘోరంగా బూతులు తిడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వారి కుమారుడు గణేశ్.. తన తల్లిని తండ్రి అంతలా తిడుతూ కొట్టడాన్ని భరించలేకపోయాడు. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి "అమ్మను ఎందుకు తిడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు?" అంటూ అడ్డుకున్నాడు. భార్యపై ఉన్న కోపంతో రమేశ్.. తనను నిలదీసిన కొడుకు గణేశ్‌ను కూడా తీవ్రంగా దూషిస్తూ కొట్టబోయాడు.
కన్నతల్లి పడుతున్న బాధను చూసి, తండ్రి అన్న మాటలకు తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన గణేశ్ క్షణికావేశంలో ఊగిపోయాడు. ఇంట్లో పక్కనే ఉన్న రోకలిబండను తీసుకుని తండ్రి రమేశ్ తలపై బలంగా బాదాడు. ఆ దెబ్బకు రమేశ్ తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
గొడవ శబ్దాలు, కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ రమేశ్ బుధవారం నాడు కన్నుమూశాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తరిగొప్పుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రమేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు నిందితుడైన కుమారుడు గణేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చిన్న విషయానికే తండ్రి ప్రాణాలు కోల్పోవడం, కన్నతండ్రిని చంపిన నేరానికి కొడుకు జైలుపాలు కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనతో అక్కరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.













Click it and Unblock the Notifications