ఆసుపత్రిలో భావోద్వేగం: ఎస్సై సిద్ధయ్య మృతి
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలుపాలై హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ని ఎస్‌ఐ సిద్ధయ్య మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం 4.06 నిమిషాలకు సిద్ధయ్య తుది శ్వాసను విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ఏప్రిల్ 4 నుంచి నగరంలోని ఎల్‌బీ నగర్‌లో ఉన్న కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్ధయ్య మృతితో కామినేని ఆసుపత్రిలో భావోద్వేగ వాతావరణ నెలకొంది. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు.

సిద్ధయ్యను బ్రతికించేందుకు కామినేని వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. 2012లో ఎస్‌ఐ ఉద్యోగంలో సిద్ధయ్య చేరాడు. సిద్ధయ్య స్వగ్రామం మహబూబ్ నగర్‌లోని జడ్చెర్ల గ్రామం. సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి జడ్చెర్లకు వచ్చి స్ధిరపడింది. సిద్ధయ్యకు ఇద్దరు అన్నదమ్ములు.
నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోగా రక్తపు మడుగులో పడిపోయిన ఎస్‌ఐ సిద్ధయ్య చావు నుండి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినట్లు సహచరులు తెలిపారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో బుల్లెట్లతో గాయాలుపాలైన సిద్దయ్యని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో తన సహచర పోలీసులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "నన్ను బతికించండి. నాకు బతకాలని ఉంది" అంటూ ఆయన చెప్పిన తీరుని గుర్తు చేసుకుంటున్న ఆయన సహచరులు తీవ్ర బాధలో ఉండిపోయారు.
ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుకున్న సిద్ధయ్య శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. వైద్యులు నాలుగు బుల్లెట్లలో రెండింటిని తొలగించగా, మరో రెండు బుల్లెట్లు శరీరంలోనే ఉన్నాయని చెప్పిన విషయం తెలిసిందే. ఒకటి తల భాగంలో ఉండగా, మరొకటి కడుపు భాగంలో ఉంది.
సిద్ధయ్య ఆరోగ్యం బాగా క్షీణించిందని, తాము అందిస్తున్న వైద్యానికి ఆయన ఏమాత్రం స్పందించినా తదుపరి బుల్లెట్లను తొలగిస్తామని వైద్యులు తెలిపారు. మంగళవారం వరకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇది ఇలా ఉంటే ఎస్‌ఐ సిద్ధయ్య భార్య అదే ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications