కేసీఆర్ ఇంటికే.. కాంగ్రెస్‌ను నమ్మి కర్ణాటక ప్రజలు మోసపోయారు: జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రాక్షసుల పార్టీ అని విమర్శించారు.
రాష్ట్రంలోని జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీనే.. ముఖ్యమంత్రిని చేస్తామని నడ్డా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం కేసీఆర్(KCR) కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదని తెలిపారు.

జమ్మూకశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబపార్టీలు ఉన్నాయని.. రాబోయే ఎన్నికల్లో కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని ప్రజలను కోరారు జేపీ నడ్డా. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని జేపీ నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు.
బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అంతా వారిదే రాజకీయ అధికారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉందని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆ ర్కు ఏటీఎంలా మారిందని అన్నారు.
కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని జేపీ నడ్డా ఆరోపించారు. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. దళితబంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని అన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు విడుదల చేస్తే ఆమొత్తాన్ని పేదలకు చేరనీయలేదని బీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని.. కేంద్రంలో మోడీ చెప్పిన పనులన్నీ చేశారన్నారు నడ్డా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని చెప్పారు. అక్కడ ఏ పథకాలూ అమలు కావడం లేదన్నారు. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని అన్నారు.












Click it and Unblock the Notifications