జూ. ఎన్టీఆర్ భార్యతో కలిసి ఓటు: హైదరాబాదీగానా అంటే, భారతీయుడిగా...
హైదరాబాద్: తాను భారతీయుడిగా ఫీల్ అవుతున్నానని నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం నాడు చెప్పారు. ఆయన జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి వచ్చారు. ఓటు వేసిన అనంతరం విలేకరులు ఆయనను పలకరించారు.
అందరూ బాధ్యతగా భావించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అద్భుతమైన నగరం అన్నారు. భాగ్యనగరం అమేజింగ్ పార్ట్ ఆఫ్ నేషన్ అన్నారు. తాను హైదరాబాదీగా గొప్పగా ఫీల్ అవుతానని చెప్పారు. హైదరాబాదీగా ఫీల్ అవుతారా అని ఓ విలేకరి ప్రశ్నించగా... భారతీయుడిగా ఫీలవుతానని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన అమూల్యమైన అవకాశం ఓటు అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని చెబుతున్నారని ఓ విలేకరి అడగగా.. అవునని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఓటు హక్కు పైన ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. భారతీయులుగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలన్నారు.
హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని చెప్పారు. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరిచారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'మేం ఓటు వేశాం.. మీరూ వేశారా.. లేదంటే ఇప్పుడే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోండి' అని కోరారు. టిడిపి యువనేత నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నాగార్జున, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న, నటుడు కమల్ తదితరులు ఓటు వేశారు.












Click it and Unblock the Notifications