జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక.. 130మంది నామినేషన్లు తిరస్కరణ.. వారికి గ్రీన్ సిగ్నల్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కొరకు అన్ని రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్, బిజెపి నుండి లంకల దీపక్ రెడ్డి హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
81 మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్
ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరుకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియగా, నామినేషన్ల స్క్రూటినీని పూర్తి చేశారు అధికారులు. దాదాపు 17 గంటల పాటు స్క్రూటినీ ప్రక్రియ జరగగా అందులో 130 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అభ్యర్థులకు చెందిన 135 నామినేషన్లను మాత్రమే ఆమోదించారు.

130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
వివిధ కారణాల వల్ల 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు అవకాశం ఉంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై రేపు పూర్తి స్పష్టత రానుంది. రేపు సాయంత్రానికి జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారు అనేది అధికారిక ప్రకటన రానుంది.
నామినేషన్లు ఉపసంహరణకు రేపే చివరిరోజు
ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 13వ తేదీన ప్రారంభం కాగా 21వ తేదీ వరకు కొనసాగింది. ఇక నామినేషన్లు ఉపసంహరణకు అక్టోబర్ 24 చివరి తేదీ ఈ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుండగా, నవంబర్ 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ కారణాలతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
ఇదిలా ఉంటే నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడం, ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను పాటించకపోవడం, సరైన పత్రాలను జత చేయకపోవడం వంటి అనేక కారణాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను పెద్ద సంఖ్యలో తిరస్కరించారు ఎన్నికల అధికారులు. మూడు ప్రధాన పార్టీల నుండి అభ్యర్థులుగా ప్రకటించి ఎన్నికల ప్రచారం సాగిస్తున్న వారి నామినేషన్లను ఆమోదించారు.












Click it and Unblock the Notifications