అమిత్ షా ను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతున్నారంటూ వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మునుగోడు అసెంబ్లీ ఎన్నిక సమయంలో కూడా నోవాటెల్ హోటల్ లో వీరిద్దరూ అరగంటపాటు భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ భేటీ కాబోతున్నారనే వార్త రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, కచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. అందుకనుగుణంగా వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు పలువురు తెలంగాణలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించుకొని అందుకనుగుణంగా పావులు కదుపుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఇంతవరకు స్పందించలేదు. మధ్యంతర బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా ఏమీ స్పందించలేదు. దీనిపై బాలకృష్ణను విలేకరులు అడిగినప్పుడు ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య సమాధానమిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడైన కల్యాణ్ రామ్ తో కలిసి స్పందించని విషయంలో వారిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
తప్పనిసరిగా రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించడం కోసమే వీరి కలయిక ఉండబోతోందంటున్నారు. అయితే దీనికి సంబంధించి పార్టీ తరఫున అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. బీజేపీ దేశవ్యాప్తంగా పేరున్న ప్రముఖులను కలిసి మాట్లాడే కార్యక్రమాన్ని రూపొందించుకుంది. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. తాజాగా మరోసారి కలవబోతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications