హేయ్.. కేఏ పాల్ మళ్లీ ఏసేశాడుగా!
అంతర్జాతీయ మీడియాతో మోడీ జాగ్రత్తగా ఉండాలని పాల్ హెచ్చరించారు.
దేశంలో మీడియాను నోరు మూయించినట్లుగా అంతర్జాతీయ మీడియా నోరు మూయించలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బీబీసీ గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోందన్నారు. గడిచిన 9 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిందన్నారు.
పత్రికా స్వేచ్ఛను నియంత్రించలేరని, బీబీసీని నోరు మూయించే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? అని ప్రశ్నించారు. తీసిన డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకు వెళ్లాలని, అంతేకానీ అంతర్జాతీయ మీడియాతో మోడీ యుద్ధం చేయవద్దని సూచించారు. ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖలు అంతర్జాతీయ మీడియాపట్ల అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలు చేయవద్దని, దేశానికి ఇది చాలా ప్రమాదకరమన్నారు.

కేసీఆర్ దేశ్ కి నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరని, కేసీఆర్ దేశ్ కి నేత కాదని, ఖమ్మం సభకి వచ్చిన ముఖ్యమంత్రులకు డబ్బులు ఇచ్చి తీసుకువచ్చారని పాల్ ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలు అని, తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని, మరో మూడు రోజుల్లోగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రకటన చేయకపోతే ఫిబ్రవరి 17న తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట అంబేడ్కర్ మద్దతు దారులు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. తాను ఢిల్లీలో లేదంటే హైదరాబాద్ లో ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని స్పష్టం చేశారు. దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీలే అమలుపరచడంలేదని ఆరోపించారు. ఏప్రిల్ 14న మాత్రమే తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని మరోసారి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications