కేఏ పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అగ్నిప్రమాద ఘటనలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కాగా, సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదని.. నరబలి అని కేఏ పాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. తన కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించారు కేఏ పాల్. దేశంలో జరిగే అగ్ని ప్రమాదాలపైనా సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా? అంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని కూడా కేఏ పాల్ వాదించారు. దీంతో సంబంధం లేని వాదనలు వినిపించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆయనను మందలించినట్లు సమాచారం.
కాగా, గతంలో కూడా తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై కేఏ పాల్ విమర్శించారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications