త్వరలో కేసీఆర్ అరెస్ట్: ప్రశాంత్ కిషోర్ చెప్పిందిదేనంటూ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన అవినీతి మయమని కేఏ పాల్ విమర్శించారు. బుధవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయిన కేఏ పాల్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోట్ల అవినీతిని పక్కదారి పట్టించడానికి గవర్నర్ ను టార్గెట్ చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవినీతి ఎక్కడా చూడలేదని పేర్కొన్న కేఏ పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు కళ్ళు నెత్తికెక్కాయి అంటూ మండిపడ్డారు. రేపో మాపో కెసిఆర్ అరెస్టు కావడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల అవినీతిని పక్కదారి పట్టించడానికి గవర్నర్ ను టార్గెట్ చేస్తున్నారని, అందుకే తమిళిసై పై కేటీఆర్ తో మాట్లాడిస్తున్నారు అంటూ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ అక్రమ పాలనను అంతం చేయడానికి అమెరికా నుంచి వచ్చానని పేర్కొన్న కేఏ పాల్, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం నేనేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కెసిఆర్ కు వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిషోర్ చెప్పారు
వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కేఏ పాల్ పేర్కొన్నారు. కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చారని, తాను వైజాగ్ నుండి వచ్చానని కేఏ పాల్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జార్జిబుష్, బిల్ క్లింటన్ లను హైదరాబాదుకు తీసుకు వచ్చింది తానేనని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు మూడు కుటుంబాలు, ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులే పాలన చెయ్యాలా అంటూ ప్రశ్నించిన కేఏ పాల్ తనను తెలంగాణకు రావాలని ఎంతోమంది పర్సనల్ గా ఫోన్ చేసి వేడుకుంటున్నారు అంటూ వెల్లడించారు.

తనను తెలంగాణా రమ్మని చాలా మంది ప్రాధేయపడ్డారు
తాను తెలంగాణలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని , వందల కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని కేఏపాల్ పేర్కొన్నారు. తనను అమెరికా విడిచి రావాలని ఎందరో వైద్యులు, పొలిటీషియన్లు, ప్రొఫెసర్లు కోదండరాం లాంటివాళ్ళు ఫోన్ చేసి మరీ ప్రాధేయ పడుతున్నారు అని కేఏ పాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని,అప్పులపాలు అయిందని కేఏ పాల్ పేర్కొన్నారు. రాష్ట్ర పాలనలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని కేఏ పాల్ విమర్శించారు. మరో 20 ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ చేసిన అప్పులు తీరవని కేఏ పాల్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications