అందుకే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశా: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కల్వకుంట్ల కవితనే కారణమంటూ ఆయన ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కాం చేయడం, జైలుకు వెళ్లడం బాధ కలిగించిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి దోచుకుందని.. దోచుకున్న డబ్బును పంచుకోవడంలో ఇబ్బంది వచ్చినందుకే ఈ పంచాయితీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. లింగాల ఘనపురం మండలం నవాబుపేట గ్రామం రిజర్వాయర్ నుంచి గుండాల, దేవరుప్పల మండలాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత పదేళ్ల అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని.. ధరణిని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాందించిందని కడియం శ్రీహరి అన్నారు. వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబం గొడవ తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.

ప్రధానంగా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఉన్నందుకేనని కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కోవడం, చాలా రోజులు జైలులో ఉండడం సరైన పద్ధతి కాదని తాను బయటకు వచ్చానని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications