Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు
Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని.. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయొద్దన్నారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నీ నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు సంబంధం లేదంటున్నారని అన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నవాళ్లు నోరు మూసుకున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మించిన తర్వాత ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదన్నారు.
పంటలకు అందుతున్న నీళ్లు ఎల్లంపల్లి ద్వారానే వస్తున్నాయన్నారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని సీపీఐ డిమాండ్ చేసిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. కానీ మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని హరీశ్ రావు అంటున్నారని ఆయన అన్నారు. కేంద్ర సర్కారు మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని.. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమన్నారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రం భయపడుతోందన్నారు.

కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూపాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. నెలకు రూ.8 వేల ఆదాయం ఉంటే ధనికుడవుతారా.. ఇదొక దగా అంటూ మండిపడ్డారు. నెలకు రూ.20 వేల ఆదాయం ఉన్నవారిని కూడా పేదవారిగానే పరిగణించాలన్నారు. అమెరికా చెప్పు చేతల్లో నరేంద్ర మోడీ పని చేస్తున్నారని కూనంనేని ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మోడీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్నారని.. భారత విదేశాంగ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications