బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి తలకిందులుగా షాడరాజు: 40 గంటలు అక్కడే, రెస్క్యూ..
కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడరాజు వేటకు వెళ్లకు వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. సుమారు 40 గంటలకుపైగా బండరాళ్ల మధ్య కాళ్లు ఇరుక్కుపోవడంతో తలకిందులుగా వేలాడుతున్నాడు. అతడ్ని సురక్షితంగా బయటకు తీసేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
షాడరాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్ంర ఇరుక్కుపోగా.. బుధవారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే బండరాళ్లను కొంతమేర తొలిచేశారు.

రాజును సురక్షితంగా బయటకు తీసేందుకు పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడేవుండి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 40 గంటలకుపైగా వేలాడుతూ షాడరాజు నరకయాతన అనుభవిస్తున్నాడు. అతడు తినేందుకు పండ్లు, నీరు అందించారు. జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఇంఛార్జీ తహసీల్దార్ సాయిలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అయితే, షాడరాజు మంగళవారం సాయంత్రం స్నేహితుడు మహేశ్ తో కలిసి ఘన్‌పూర్ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రాళ్ల మధ్యలో కాలు ఇరుక్కుపోవడంతో అక్కడే చిక్కుకుపోయాడు. అయితే, మహేశ్ అతడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కానీ, వేటకు వెళ్లామని చెప్పాల్సి వస్తుందని అతడు అధికారులకు ఎవరికీ సమాచారం అందించలేదు. కుటుంబసభ్యులు, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చి ప్రయత్నించారు కానీ, అతడ్ని బయటికి తీయలేకపోయారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
మరోవైపు, షాడరాజు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను క్షేమంగా బయటికి తీసుకురావాలని ఆయన భార్య అధికారులను కోరింది.












Click it and Unblock the Notifications