గ్రేట్ పోలీస్: పురుగుల మందు తాగిన రైతును 2 కిలోమీటర్లు భుజాన మోసిన కానిస్టేబుల్
కరీంనగర్: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన మంచి మనసును చాటుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతును కాపాడేందుకు ఏకంగా రెండు కిలోమీటర్ల మేర అతడ్ని భుజాన మోసుకెళ్లాడు పోలీస్ కానిస్టేబుల్. సరైన సమయంలో స్పందించి రైతు ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్‌పై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన రైతు సురేష్ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వెళ్లాడు. జీవితంలో విసుగుచెందిన అతడు తన పొలంలోనే పురుగులు మందు తాగాడు. అక్కడున్నవారు ఇది గమనించి 100కు కాల్ చేశారు. వెంటనే బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే, అప్పటికే సురేష్ అపస్మారకస్థితిలో పడివున్నాడు. అంబులెన్స్‌కు కాల్ చేసి, అది వచ్చి తీసుకునే వెళ్లేసరికి రైతు ప్రాణాలు దక్కవని భావించిన కానిస్టేబుల్ జయపాల్.. ఆ రైతును భుజాన వేసుకుని పొలాల మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సురేష్‌కు వైద్యులు వెంటనే చికిత్స అందించారు.
ప్రస్తుతం సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. సకాలంలో స్పందించి సురేష్ ప్రాణాలు కాపాడిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. సురేష్ ప్రాణాలు కాపాడిన జయపాల్ కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశారు అతని కుటుంబసభ్యులు. ఒక నిండు ప్రాణం కాపాడిన జయపాల్‌పై సర్వత్రా ప్రశంలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications