బీజేపీలోకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు: బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్
కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. కేంద్రమంత్రి బండి సంజయ్.. సునీల్ రావుకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండటంతో అభివృద్ధి కొనసాగాలని బీజేపీలో చేరుతున్నట్లు సునీల్ రావు తెలిపారు. అవినీతి అక్రమాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను ఎక్కడా అవినీతి, అవకతవకలకు పాల్పడలేదన్నారు.

కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై సునీల్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గంగుల కమలాకర్‌కు కమీషన్లు ముడితే చాలని.. పనుల గురించి పట్టించుకోరని మండిపడ్డారు. కరీంనగర్‌లో జరిగిన ప్రతి కుంభకోణంలో గంగుల కమలాకర్ పాత్ర ఉందన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కొందరు తమ అనుయాయులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని సునీల్ రావు మండిపడ్డారు. తనపై విమర్శలు చేయిస్తున్న వారు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో తన వద్ద చిట్టా మొత్తం ఉందన్నారు. త్రిబుల్ వన్ జీవోలో భూములు ఎక్కడెక్కడ కొన్నారో, ఖాజీపూర్ ఇసుక క్వారీ అక్రమాలు, మానేరు రివర్ ఫ్రంట్‌లో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సునీల్ రావు హెచ్చరించారు.

బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిని గంగుల ఏనాడూ పట్టించకోలేదని విమర్శించారు. నగరాభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంతకాలం మౌనంగా ఉన్నట్లు తెలిపారు. రోడ్లు, చెక్ డ్యాంల కాంట్రాక్టర్లు అందరూ బినామీలేనని ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు సునీల్ రావు. త్వరలోనే మరికొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని చెప్పారు.












Click it and Unblock the Notifications