కేసీఆరే పెద్ద నక్సలైట్: బాబుపై దుమ్మెత్తిపోసిన కర్నె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే అతిపెద్ద నక్సలైట్ అని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్ శుక్రవారం అన్నారు. ఆయన అసెంబ్లీ ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంటే కేసీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసేవారని గురువారం టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. దానికి కర్నె కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో అతిపెద్ద నక్సలైట్ కేసీఆరే అన్నారు. కేసీఆర్ పైన ఎవరైనా విమర్సలు గుప్పిస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్లే అవుతుందన్నారు. మిషన్ కాకతీయ పైన తెలంగాణ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధి కోసం చేపడుతున్న మిషన్ కాకతీయను ఓర్చుకోలేకపోతున్నారన్నారు.

గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. చెరువుల పునరుద్ధరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. సమ సమాజం కోసం పాటుపడుతున్న మావోయిస్టులను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు.
చంద్రబాబు దుర్మార్గపు పాలనలో గద్దర్ వెన్నులో బుల్లెట్ దిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు గద్దర్ మిషన్ కాకతీయ పైన ప్రచారానికి బయలుదేరారని చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications