చంద్రబాబుకు మరో షాక్: టీటీడీపీకి, అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించినట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాసాని సుముఖంగా ఉండగా.. టీడీపీ అగ్ర నాయకత్వం మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు కాసాని.
ముందు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి.. అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిన తర్వాత.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని అధిష్టానం నిర్ణయించడం కాసానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా అగ్ర నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీలో ఉండి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానానికి చెప్పినా.. వినకపోవడంతో కాసాని చివరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
కాగా, ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌కు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. తనకు సముచితన స్థానం కల్పించే పార్టీలోకే వెళ్లే ఆలోచనలో కాసాని ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలో చేరే విషయంపై ఆయన త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, తాను పోటీ చేస్తే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.












Click it and Unblock the Notifications