న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పోరాటం మరో 'తెలంగాణ ఉద్యమం'లా కనిపిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఆమె, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
"ఆనాటి ప్రభుత్వ నిర్ణయాల్లో నేను కూడా భాగమే.. ఆ పాపంలో నాకు వాటా ఉంది. మీ జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయినందుకు.. మీ చెల్లిగా నన్ను క్షమించాలని కోరుతున్నాను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ధర్నా ప్రాంగణంలో చర్చనీయాంశమయ్యాయి.

ప్రభుత్వంపై ఒక్క రూపాయి అదనపు భారం పడకుండానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఏజెన్సీలకు కొమ్ముకాస్తోందని కవిత ఆరోపించారు. వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. "900 ఏజెన్సీలకు లాభం చేకూర్చడం కోసం 5 లక్షల మంది ఉద్యోగుల పొట్ట కొడుతున్నారు. ఏజెన్సీలకు జీఎస్టీ తగ్గించిన ప్రభుత్వం, ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు ఎందుకు బదిలీ చేయడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. రెండు రోజుల్లోగా ఉద్యోగ భద్రతపై జీవోలు రాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మేధావుల మౌనం.. ఉద్యోగులకు శాపం!
తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న కోదండరాం, హరగోపాల్ వంటి మేధావుల మౌనాన్ని కవిత తప్పుబట్టారు. గతంలో ధర్నా చౌక్ ఎత్తివేతపై మాట్లాడిన వారు, ఇప్పుడు అదే ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు ఆత్మఘోష వినిపిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. "మేధావుల మౌనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారింది. రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన వారు ఇప్పుడు ఈ 5 లక్షల కుటుంబాల గోడును పట్టించుకోవాలి" అని ఆమె సూచించారు.
రాజకీయ పార్టీగా జాగృతి.. కొత్త విధానం..
తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతోందని కవిత ఈ వేదికపై కీలక ప్రకటన చేశారు. "మా పార్టీ అధికారంలోకి వస్తే అసలు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే వ్యవస్థలే ఉండవు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండాలన్నదే మా పాలసీ" అని స్పష్టం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల విషయంలో తాను ఎంత మొండిగా పోరాడానో, ఈ 5 లక్షల మంది ఉద్యోగుల కోసం కూడా అదే స్థాయిలో కొట్లాడుతానని భరోసా ఇచ్చారు.
హాఫ్ మిలియన్ మార్చ్‌కు పిలుపు..
"నాడు మిలియన్ మార్చ్‌తో తెలంగాణ సాధించుకున్నాం.. నేడు మీ 5 లక్షల మంది 'హాఫ్ మిలియన్ మార్చ్' నిర్వహిస్తే హైదరాబాద్ వీధులు దద్దరిల్లాలి. అప్పుడే ఈ ప్రభుత్వం దిగివచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది" అని కవిత పిలుపునిచ్చారు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో మహిళా ఉద్యోగులకు కనీసం ప్రసూతి సెలవులు (Maternity Leaves) కూడా దక్కకపోవడం దారుణమని, ఈ దోపిడీ వ్యవస్థ పోయే వరకు జాగృతి మీ వెంటే ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications