ఉబికి వచ్చిన కన్నీటిని అపుకోలేకపోయిన కేసీఆర్
MLA Maganti Gopinath: భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో ఈ నెల 5వ తేదీన ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ ప్రాతినిథ్యాన్ని వహించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలచుకున్నారు. 1983లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1992 వరకూ తెలుగు యువత అధ్యక్షుడిగా వ్యవహరించారు.

2014లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారిగా శాసన సభకు ఎన్నికయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కడువా కప్పుకొన్నారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే పరిస్థితి రాలేదాయనకు. ఆ తరువాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు.
2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజరుద్దీన్ ను 16 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు.
తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో ఈ నెల 5వ తేదీన ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ డాక్టర్లు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. మాగంటి మరణంతో బీఆర్ఎస్ లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణవార్త తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.
మాగంటి గోపీనాథ్ మరణం పార్టీ కి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని నివాళి అర్పించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు కేసీఆర్. ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన దుఖ్ఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టారు.












Click it and Unblock the Notifications