బెంగుళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర; వదిలిపెట్టేది లేదన్న బండి సంజయ్
ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ కెసిఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్, డ్రగ్స్, క్యాసినో దందా చేసేవారి అంతు చూస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ వేల కోట్లు దండుకుని లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందాల్లో కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు పెట్టిందని బండి సంజయ్ కెసిఆర్ కుటుంబం పై సంచలన ఆరోపణలు చేశారు. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామంలో మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

బెంగుళూరు డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ పాత్ర : బండి సంజయ్
మన రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని పేర్కొన్న బండి సంజయ్, మేనేజ్ చేసి ఆ కేసును మూసివేయించారని అన్నారు. వెంటనే ఆ కేసును మళ్లీ ఓపెన్ చేసి దోషులతోపాటుబాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం దొంగ దందాలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ సాకు చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కెసిఆర్ పైన ఉన్న పాత కేసులన్నింటినీ తిరగ దోడాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాస్ పోర్ట్ ల బ్రోకర్.. ఆయనకు బ్రోకరిజం వెన్నతో పెట్టిన విద్య
కెసిఆర్ ఒక పాస్పోర్ట్ ల బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ధాన్యం సేకరణ విషయంలో రైతుల దగ్గర నుంచి బ్రోకర్రిజం చేస్తున్న కెసిఆర్ కు పైసలు ఇస్తున్నది మోడీనే అంటూ పేర్కొన్నారు . ధాన్యం కొనడానికి కేసీఆర్ ముందుకు రావడం లేదు. వరి వేస్తే ఉరే అన్నాడని, దొడ్డు వడ్లు, సన్న వడ్లు అంటూ... రైతులను ఆగం చేశాడని పేర్కొన్నారు. ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే...ఎకరంపై సుమారు రూ.30 వేలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. రైతు బంధు అని, మిగిలిన అన్నిటిని కేసీఆర్ ఇవ్వకుండా బందు చేశాడని, దాని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. 300 ఎకరాల్లో పంటలు వేసుకుంటూ కేసీఆర్ ఏమో కోటీశ్వరుడు అవుతాడు. రైతులను మాత్రం బికారీలను చేస్తాడు అని నిప్పులు చెరిగారు.

ట్విట్టర్ టిల్లు అంటూ కేటీఆర్ పై బండి తీవ్ర వ్యాఖ్యలు
మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ట్ ట్విట్టర్ టిల్లు మిషన్ భగీరథ నీళ్లపై అన్ని అబద్ధాలే చెప్తున్నాడని విమర్శించారు. ఇక్కడ నీళ్లు లేవు, ఇండ్లు లేవు... రోడ్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. పెన్షన్లు ఇవ్వడం లేదు. తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా చేశాడని మండిపడ్డారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్.... ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించ లేదు? చెప్పాలన్నారు. దళిత బందు, దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమైంది? అని ప్రశ్నించారు

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ప్రమేయంపై బండి సంజయ్ వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో కవిత ప్రమేయమున్నదని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబం వ్యాపారాలు చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం పైసలు లేవు అని ఎద్దేవా చేశారు. క్యాసినో లో పెట్టుబడులు, ఆడవాళ్లు అయ్యుండి కూడా మద్యంలో పెట్టుబడులు పెడతారా అంటూ మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం వేలకోట్లకు ఎదుగుతారు. వేలకోట్ల రూపాయలను దండుకుంటున్నారు.

కేసీఆర్ కుటుంబ దందాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదు
లిక్కర్ దందా చేసే వాళ్లను విడిచిపెడదామా? డ్రగ్స్ ను చిన్నపిల్లలకు అలవాటు చేస్తున్న వాళ్లని విడిచిపెడదామా? పత్తాల ఆటలో పెట్టుబడులు పెట్టిన వాళ్లను విడిచిపెడదామా? అని ప్రశ్నించిన బండి సంజయ్ కర్ణాటక, బెంగళూరులోడ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగిరి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ పోలీసులతో కలిసి, కేసీఆర్ ఆ కేసును నీరుగార్చారని, ఆ కేసును మళ్ళీ బయటకు తీయించి అందులో ఉన్న వ్యక్తులను బయటికి తెస్తామన్నారు. కేసీఆర్ తో పాటు డ్రగ్స్ కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications