డీకే శివకుమార్‌పై కేసీఆర్ సెటైర్లు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజూ రెండు మూడు బహిరంగ సభలతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూసుకెళ్తున్నారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని వివరించారు. ఆలేరు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు రైతుల స్థితిగతులనే మార్చాయన్నారు. ఇదివరకు 20 ఎకరాల జాగా ఉన్నా పిల్లను ఇయ్యకపోయేదని.. అటెండర్‌ ఉద్యోగం ఉన్నా ఇచ్చెటోళ్లని అన్నారు. కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందన్నారు. తెలంగాణలో భుముల విలువ పెరిగిపోవడంతో ఉద్యోగం లేకపోయినా సరే జాగా ఉంటే పిల్లను ఇస్తున్నరని కేసీఆర్ చెప్పారు.

KCR hot comments on DK Shivakumar and Congress, BJP in election campaign

రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని. కాంగ్రెసోళ్లు అక్కర్లేదంటున్నారని మండిపడ్డారు. రైతు బంధు పథకం ఇస్తే కాంగ్రెస్‌ది ఏం పోయిందని సీఎం ప్రశ్నించారు. 'భూముల కిరికిరి లేకుండా ధరణిని తీసుకొచ్చినం. కానీ కాంగ్రెసోళ్లు ఆ ధరణిని కూడా తీసేస్తం అంటున్నరు. ధరణిని ఎత్తేస్తే రైతుబంధు ఎట్లొస్తది. భూముల రిజిస్ట్రేషన్‌లలో మళ్లీ అక్రమాలు మొదలైతయ్‌. ఇది ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నా. ధరణి లేకపోతే అక్రమంగా ఒకరి పేరు మీది భూమి మరొకరి పేరు మీదకు మారుతది. ధరణి ఉంటే మీరు బొటన వేలు పెడితే తప్ప మీ పేరు మీది భూమిని ఇంకెవడూ తన పేరు మీదికి మార్చుకోలేడు' అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

అంతేగాక, 24 గంటల కూడా ఇవ్వదంంటున్నారని కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. మరోవైపు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌పై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సాగుకు కరెంటు విషయంలో ధ్వజమెత్తారు. డీకే శివకుమార్‌ తీరు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన డీకే.. రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ కరెంటు విషయంలో సవాల్‌ చేశారని, ఆయన విసిరన సవాల్‌ హాస్యాస్పదంగా ఉందన్నారు.


'కేటీఆర్‌ మా గొప్పతనం మీకు తెలుసా..? మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నాం. కావాలంటే వచ్చి చూసుకో' అని డీకే శివకుమార్‌ గొప్పలకు పోయిండని సీఎం విమర్శించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుంటే.. కర్ణాటకలో తాము 5 గంటల కరెంటు ఇస్తున్నామని శివకుమార్‌ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదన్నారు కేసీఆర్.

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలని, ఎవరికి పడితే వాళ్లకు కాకుండా... మంచి, చెడు, న్యాయం, అన్యాయం గురించి ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది, ఏ పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తది అనేది ప్రజలు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలేరు రూపు రేఖలే మారిపోయాయని చెప్పారు. సునీతను మరోసారి గెలిపిస్తే ఆలేరులో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

ఇది ఇలావుండగా, తుంగతుర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తుంగతుర్తి ప్రాంతం అంతా పోరాటాల గడ్డ అని, ఈ ప్రాంత ప్రజలు గోదావరి జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత కొట్లాడినా ఏ పార్టీ కూడా కనికరించలేదని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని గోదావరి జలాలను తెచ్చుకోగలిగినం కాబట్టే ఈ ప్రాంతానికి ఇప్పుడు జలకళ వచ్చిందన్నారు కేసీఆర్. దాదాపు 1.20 లక్షల నుంచి 1.30 లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తున్నయని, దీంతో తుంగతుర్తి ప్రజానీకం మొకాలు తెల్లబడ్డయన్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం మేమే ఇచ్చినం అని చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులకు సిగ్గుండాలె అని కేసీఆర్‌ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంతో మందిని జైల్లో పెట్టిండ్రని, కేసుల పేరుతో వేధింపులకు గురి చేసిండ్రని కేసీఆర్ గుర్తుచేశారు. చివరికి చెరుకు సుధాకర్‌ను కూడా పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేశారని కేసీఆర్ చెప్పారు.

కోదాడ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇప్పుడున్న చోట కట్టాల్సింది కాదని.. అక్కడ్నుంచి 20 కిలోమీటర్లపైన ఏళేశ్వరం వద్ద కట్టాల్సిందన్నారు. కానీ, ఆనాడు అప్పుడున్న నేతలు గోల్ మాల్ చేసిన ఫలితంగా తెలంగాణ ప్రాంతానికి నీరు తక్కువగా వచ్చేలా కుట్ర జరిగిందన్నారు కేసీఆర్. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకుని కూర్చున్నారన్నారు.

మరోవైపు, కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై సెటైర్లు వేశారు. 'ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జిల్లాలో పెద్ద నాయకుడు. ఆయన ఎంత బుద్ధిమంతుడంటే.. ప్రజలు కట్టే అమూల్యమైన ట్యాక్సులను రైతుబంధు ఇస్తున్నడు.. అది వేస్ట్‌ అని మాట్లాడుతున్నడు. రాహుల్‌ గాంధీ, భట్టి విక్రమార్క, ఘనత వహించిన పీసీసీ అధ్యక్షుల వారు చెబుతున్నరు మేం గెలిచిన తెల్లారి ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రస్తుత పథకాలను రద్దు చేస్తారని హెచ్చరించారు. ఆలోచించి ఓటు వేయాలని ప్రలజను మరోసారి కోరారు కేసీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+